Tuesday, May 26, 2009

టీకొట్ట.. ఆవకాయ


నేను వెళ్లేసరికే టీకొట్టు బెంచీలన్నీ నిండుగా ఉన్నాయి.
ఈవేళ ఏమిటి ఇంత రష్.. అనుకున్నాను.
కాస్త ప్రశాంతంగా టీ తాగడానిక్కూడా స్థలం దొరకదే దేశంలో అని తిట్టుకుంటూ లోనికి వెళ్లాను.
అదృష్టం, ఎవరో నాకోసమే సీటు ఖాలీ చేస్తున్నట్టు లేచి వెళ్లి పోయారు. టక్కున ఆ సీట్లో కూలబడి గాలి వస్తుందేమో నని పైకీ, కిందకకీ చూశాను, ఫరవాలేదు ఫ్యాను తిరుగుతోంది.
వేసవి కదా, ఐదు దాటినా వేడిమి తగ్గడంలేదు.
నా వేనుక ముగ్గురు మద్య వయసు వాళ్లు ఏదో మాటాడుకుంటున్నారు.
వినడానికి ప్రయత్నించాను.
అలా వినడం తప్పుకాదా అంటే
అది పబ్లిక్ ప్లేస్.. మనం వద్దన్నా వినిపిస్తాయని నా సమాధానం.
సరే. వారేం మాటాడుకుంటున్నారో విందాం. టీ వచ్చేలోపుగా..
పైగా వాళ్లు వంటల గురించో ఏమో మాటాడుకుంటున్నారు..
ఒకడంటన్నాడు.. ఈ సీజన్లో ఊరగాయల వ్యాపారం పెట్టి, తాత్కాలికంగా కొంత సంపాదించుకోవచ్చునని.
అందుకు రెండో వాడు.. మనం ఊరగాయలు పెడితే కొనే వారెవరు? అన్నాడు.
మూడో వాడు.. రుచిగా, సుచిగా ఉంటే ఎవరైనా కొంటారు.
కొనేవాడికి రూపాయి చవగ్గా, మంచిది దొరికితే వద్దంటాడా! అన్నాడు.
ఈ మద్దతుతో మొదటి వాడు ... ఏదో ఉత్సాహంగా చెప్పే లోపే
రెండో వ్యక్తి.. అందుకుని ఊరగాయలు పెట్టడం మాటలు కాదు. అది చాలా మంది ఆడవారికే తెలియదు అన్నాడు.
మొదటి వాడు.. అదేం లేదు ప్రస్తుతం దేనికైనా పుస్తకాలు దొరుకుతాయి. మొదట ఓ కేజీ ఊరగాయ పెట్టి వారం రోజులు మనం వాడి చూద్దాం. మనకు నచ్చితే.. అందరికీ నచ్చుతుందికదా, అన్నాడు.
దానికి రెండోవాడు ఇది చిరంజీవి సినిమా కాదు మనకు నచ్చితే అది తప్పకుండా వంద రోజులు ఆడ్డానికి. ఊరగాయల వ్యవహారం అని గుర్తు చేశాడు.
సరే. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుందో అన్న రెండో వ్యక్తిని వారిస్తూ..
మొదట ఊరగాయల ప్రస్తావన తెచ్చిన వ్యక్తి, తన జేబులోంచి ఓ కాగితం తీసి, పాత వీక్లీలో ఆవకాయ తయారీ గురించిన వివరాలు... ఇదిగో ఇది చదివిన తరువాతే నాకు ఊరగాయల అయిడియా వచ్చింది. మీకు చూపించడానికి తెచ్చానన్నాడు.
ఇక ఉత్సుకత ఆపుకోలేక వెనక్కు తిరిగి, ఏది ఓ సారి చూడనీయండీ అంటూ ఆ కాకిగతం చనువుగా లాక్కున్నాను. (నాకు ఆవకాయ అంటే అంతిష్టం)

ఆ పాత కాగితంలో ఉన్న వివరాలు.. మీరూ చదవండి.......
ఆవకాయ తయారీకి కావలసిన పదార్ధాలు..
- పచ్చి మామిడికాయలు - కేజీ
- మిరపపొడి- పావుకేజీ
- ఆవపొడి- పావు కేజీ
- పచ్చి శనగలు - 100 గ్రాములు
- ఉప్పు - పావు కేజీ
- నువ్వులనూనె - కేజీ
- మెంతులు - 10 గ్రాములు
తయారీ విధానం....
మామిడి కాయలు తొలుత కడిగి తేమ ఆరేవరకూ ఆరనిచ్చి, ముట్టె తో సహా మీడియం సైజు ముక్కలు కొట్టుకోవాలి ( ఆవకాయకు కండ ఎక్కువ, పులుపు బాగా ఉండే మామిడికాయలు విడిగా అమ్ముతారు, అవి కొనుక్కోవాలి). అవాలు వేయించి పొడి చేసుకోవాలి. తరువాత, మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, శనగలు, మెంతులు వేసి సమంగా కలిసేలా కలిపి నూనె పొయాలి. దీనిని మూడు రోజులు బాగా ఊరనిచ్చి, తిరిగి మరోసారి కలిపి వాడుకోవచ్చు. (తడి తగలకూడదు, పాత్రలు పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి)
అంతే... కాగితం వాళ్లకి ఇచ్చేసి, టీ క్యాన్సిల్ అంటూ బజారుకు బయలు దేరాను మామిడి కాయలు కొనడానికి.
- మన్నవ గంగాధర ప్రసాద్

3 comments:

పరిమళం said...

ఆవకాయ్ లో సెనగలు వెయ్యరనుకుంటా ....
ఇంతకూ ఆవకాయ్ ఎలాఉందో చెప్పకుండానే ముగించేశారు :) :)

mannava gangadhara prasad said...

పరిమళం గారూ
ఆవకాయలో శనగలు(సుండల్) పచ్చివి వేస్తారు కొన్నిప్రాంతాల్లో. మరికొన్ని చోట్ల శనగపప్పు వేస్తారు.

Anonymous said...

నిజమే.. ప్రసాద్ గారు, చిత్తూరు జిల్లాలో ఆవకాయలో శనగలు వేస్తాం. మీ కథనంబాగుంది,రీడబులిటీ ఉంది.