Saturday, July 25, 2015


ఊహలగానుగ
- మన్నవ గంగాధర ప్రసాద్‌ (25-07-2015)మౌనంగా రోధించడం ఎలాగో సాధన చేస్తున్నాను నేస్తమా!
జీవన చిత్రంలో రంగులు వెలిసిపోకుండా కాపాడుకోవడానికి అదొక్కటే దారి కదా!
అందుకే. . . !
కంటినీటి సరస్సులు మొగ్గతొడగకుండా కాపు కాస్తున్నాను.
ఆవేదన గుండెగోడలు మీరకుండా అడ్డుపడుతున్నాను.

చర్మం దిగువన
నిస్తేజం పేరుకుని పోతోంది
నిస్సారమయిన అనుభవాల వనిలో వెంట్రుకలు అందుకే తెల్లబడుతున్నాయి.
సమాజాన్నంలోని సువాసనలను నాలుకలుకలు గుర్తించ లేక పోతున్నాయి.
(నా లుకలుకలు, నాలుక లుకలులు)
దివారాత్రాలు అహోరాత్రంగా ఒంటరి యాగాలు చేస్తున్నాయి.
దింపలేని ఊహల గానుగల బరువులు మోస్తున్నాయి.

అందుకే నేస్తం
పరివర్తనలేని వర్తమానాన్ని తిలికిస్తూ
అజ్ఞాతంగా విలపిస్తున్నాను.
ఎవరికీ వినిపించకుండా జీవిస్తున్నాను.
ఎవరికీ కనిపించ కుండా నడుస్తున్నాను.

---0---

Monday, June 15, 2015

విన్నామాట..!
... మన్నవ గంగాధరప్రసాద్‌

ఇది
నది వంటి జీవనయానం
మది గది దాటని వైనం

మౌనంగా రోధించలేని సంకెళ్లు..
గుండె చుట్టూ మొలుస్తున్న వాడి ముళ్లు..
ఆలోచనలను బంధిస్తున్న అజ్ఞాత జ్ఞాపకాల ముళ్లు..

ప్రయాణం కొనసాగుతోంది
ప్రయాసలు వికసిస్తున్నాయి
ప్రమోదం ఆస్తమిస్తోంది
ప్రభాతాలు అంతరించిపోతున్నాయి

మర చెంబులోకి కుంచించుకుపోతున్న విశాలత్వం
చెర చిరునామాగా మారుతున్న మానవత్వం
పొర పొరలుగా విడిపోతున్న  జీవనమాధుర్యం
తర తరాలుగా  అదే వైదుష్యం ప్రదర్శిస్తున్న ఆహార్యం

కంటిని విడిచి జారిపడని నీటి చుక్క
మంటిని తాకడానికి జంకుతున్న వాన చుక్క
మౌన మధ్యాహ్నాలలో విలపిస్తున్న తులసిమొక్క
ఈ వర్తమానావమానవాటికలో దహనం కాని తిక్క

మన్నవా..!
ఇది విన్నావా!!
జీవితం అంటే ఏమిటో...

మరణం చెబుతోంది, రా!... వింటావా?

Thursday, May 21, 2015

అడ్డుకట్ట...!!?
కంటిమీదికి అలల దాడిని అడ్డుకోవడానికి మెలుకువను అడ్డం పెట్టుకుంటున్నాను.
మెదడు తొలుస్తున్న ఆలోచనల గునపానికి నిద్రమత్తు మూకుడు అడ్డుపెడుతున్నాను.
నీరుకారిపోతున్న నమ్మకానికి
ఆశల ఐస్‌ పెడుతున్నాను.
నేను, నేనుగా మనగలుగుతానా
అన్న అనుమానం నన్ను తినేయకుండా
జీవితాన్ని అడ్డుపెడుతున్నాను.
రెండు సంధ్యల మధ్య నలిగిపోతున్న నడతలోపలి మడతలో కుమిలిపోతున్నాను.
- మన్నవ గంగాధరప్రసాద్

Tuesday, May 19, 2015

శ్రీరామ

తేగీ. ఆవకాయను తలచినన్‌.. ఆకలగును
చెట్టుపైకాయ.. ఆవతో చెప్పలేని
రుచిని కూర్చిన పూర్వుల పచివిలువల
దివ్వత తలచి తినుడయ్య.. దినదినమ్ము.
- మన్నవ గంగాధరప్రసాద్‌


Sunday, April 5, 2015

టీకొట్ట..

ఆవకాయ


నేను వెళ్లేసరికే టీకొట్టు బెంచీలన్నీ నిండుగా ఉన్నాయి. ఈవేళ ఏమిటి ఇంత రష్.. అనుకున్నాను. కాస్త ప్రశాంతంగా టీ తాగడానిక్కూడా స్థలం దొరకదే దేశంలో అని తిట్టుకుంటూ లోనికి వెళ్లాను. అదృష్టం, ఎవరో నాకోసమే సీటు ఖాలీ చేస్తున్నట్టు లేచి వెళ్లి పోయారు. టక్కున సీట్లో కూలబడి గాలి వస్తుందేమో నని పైకీ, కిందకకీ చూశాను, ఫరవాలేదు ఫ్యాను తిరుగుతోంది. వేసవి కదా, ఐదు దాటినా వేడిమి తగ్గడంలేదు. నా వేనుక ముగ్గురు మద్య వయసు వాళ్లు ఏదో మాటాడుకుంటున్నారు. వినడానికి ప్రయత్నించాను. అలా వినడం తప్పుకాదా అంటే అది పబ్లిక్ ప్లేస్.. మనం వద్దన్నా వినిపిస్తాయని నా సమాధానం. సరే. వారేం మాటాడుకుంటున్నారో విందాం. టీ వచ్చేలోపుగా.. పైగా వాళ్లు వంటల గురించో ఏమో మాటాడుకుంటున్నారు.. ఒకడంటన్నాడు.. సీజన్లో ఊరగాయల వ్యాపారం పెట్టి, తాత్కాలికంగా కొంత సంపాదించుకోవచ్చునని. అందుకు రెండో వాడు.. మనం ఊరగాయలు పెడితే కొనే వారెవరు? అన్నాడు. మూడో వాడు.. రుచిగా, సుచిగా ఉంటే ఎవరైనా కొంటారు. కొనేవాడికి రూపాయి చవగ్గా, మంచిది దొరికితే వద్దంటాడా! అన్నాడు. మద్దతుతో మొదటి వాడు ... ఏదో ఉత్సాహంగా చెప్పే లోపే రెండో వ్యక్తి.. అందుకుని ఊరగాయలు పెట్టడం మాటలు కాదు. అది చాలా మంది ఆడవారికే తెలియదు అన్నాడు. మొదటి వాడు.. అదేం లేదు ప్రస్తుతం దేనికైనా పుస్తకాలు దొరుకుతాయి. మొదట కేజీ ఊరగాయ పెట్టి వారం రోజులు మనం వాడి చూద్దాం. మనకు నచ్చితే.. అందరికీ నచ్చుతుందికదా, అన్నాడు. దానికి రెండోవాడు ఇది చిరంజీవి సినిమా కాదు మనకు నచ్చితే అది తప్పకుండా వంద రోజులు ఆడ్డానికి. ఊరగాయల వ్యవహారం అని గుర్తు చేశాడు. సరే. పుస్తకం ఎక్కడ దొరుకుందో అన్న రెండో వ్యక్తిని వారిస్తూ.. మొదట ఊరగాయల ప్రస్తావన తెచ్చిన వ్యక్తి, తన జేబులోంచి కాగితం తీసి, పాత వీక్లీలో ఆవకాయ తయారీ గురించిన వివరాలు... ఇదిగో ఇది చదివిన తరువాతే నాకు ఊరగాయల అయిడియా వచ్చింది. మీకు చూపించడానికి తెచ్చానన్నాడు. ఇక ఉత్సుకత ఆపుకోలేక వెనక్కు తిరిగి, ఏది సారి చూడనీయండీ అంటూ కాకిగతం చనువుగా లాక్కున్నాను. (నాకు ఆవకాయ అంటే అంతిష్టం) పాత కాగితంలో ఉన్న వివరాలు.. మీరూ చదవండి....... ఆవకాయ తయారీకి కావలసిన పదార్ధాలు.. - పచ్చి మామిడికాయలు - కేజీ - మిరపపొడి- పావుకేజీ - ఆవపొడి- పావు కేజీ - పచ్చి శనగలు - 100 గ్రాములు - ఉప్పు - పావు కేజీ - నువ్వులనూనె - కేజీ - మెంతులు - 10 గ్రాములు తయారీ విధానం.... మామిడి కాయలు తొలుత కడిగి తేమ ఆరేవరకూ ఆరనిచ్చి, ముట్టె తో సహా మీడియం సైజు ముక్కలు కొట్టుకోవాలి ( ఆవకాయకు కండ ఎక్కువ, పులుపు బాగా ఉండే మామిడికాయలు విడిగా అమ్ముతారు, అవి కొనుక్కోవాలి). అవాలు వేయించి పొడి చేసుకోవాలి. తరువాత, మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, శనగలు, మెంతులు వేసి సమంగా కలిసేలా కలిపి నూనె పొయాలి. దీనిని మూడు రోజులు బాగా ఊరనిచ్చి, తిరిగి మరోసారి కలిపి వాడుకోవచ్చు. (తడి తగలకూడదు, పాత్రలు పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి) అంతే... కాగితం వాళ్లకి ఇచ్చేసి, టీ క్యాన్సిల్ అంటూ బజారుకు బయలు దేరాను మామిడి కాయలు కొనడానికి.
- మన్నవ గంగాధర ప్రసాద్