Saturday, June 20, 2009

కానుగ చెట్టు .. ..


నేను పుట్టడం ఫక్తు పల్లెలో పుట్టినప్పటికీ, చాలా చిన్న వయసులోనే మేం పట్టణానికి వచ్చేశాం. అయితే తొలినాళ్లలో చాలా తరచుగా మా పల్లెకు వెళ్లేవాళ్లం. ముఖ్యంగా సెలవుల్లో దాదాపు గ్రామంలో ఉండేవాళ్లం. ఇప్పటి మాదిరిగా కోచింగులు, ప్రత్యేక తరగతులు అప్పుడు ఉండేవి కాదు. వేసవి అంటే బలాదూర్ తిగడమే.

మాకు కంప్యూటర్ అంటే తెలియకపోవడం ఎంత అదృష్టమో ఇపుడు అర్ధం అవుతూ ఉంది. బిల్ గేట్స్ మరో పదేళ్లు ముందు పుట్టకపోవడం మాతరానికి మేలుచేసింది. గ్రామంలో, మా అమ్మమ్మ ఇంటివద్ద ఓ పెద్దకానుగచెట్టు ఉండేది. వేసవిలో ఆచెట్టు నాకు మంచి సావాసగాడుగా మారిపోయేది. ఆ చెట్టుకు నాకు తెలీయని అనుబందం అంతర్లీనంగా అల్లుకునేది. ఇంతకాలం అయినా ఆ చెట్టు నా జ్ఞాపకాల వనంలో పచ్చగా ఉండడానికి అదే కారణం.

ఆ చెట్టెక్కి ఊగడానికి, దానితో మాటలాడి, పైకెక్కి దూకి, దెబ్బలాడ్డానికే నేను ఆవూరు వెళ్లే వాణ్నేమో. ఆ చెట్టుపై నాకు పట్టా ఉన్నట్టు మరెవ్వరినీ అక్కడకు రానిచ్చేవాణ్ని కాదు. ఎంత కలిసి ఆడుకున్నా మరెవ్వరూ ఊయల ఊగకూడదు, కట్టకూడదు. మరో చోటుకు వెళ్లవలసిందే. మరో చెట్టు చూసుకోవలసిందే. నేను సెలువుల్లో వస్తానని తెలియగానే మా మేన మావ కొత్త చేంతాడుతో ఆ చెట్టుకు ఓ ఊయల సిద్దం చేసేవాడు. పురిటి బిడ్డన అక్కున చేర్చుకునే తల్లిలాగా , ఆ చెట్టు నన్ను కౌగలించుకునేది. ఇంకా చెప్పాలంటే జాగ్రత్తగా పొదివి పట్టుకునేది. ఎర్రటి ఎండలో గోలీలు అడే నాకు చల్లదనం తగ్గకుండా తన రెమ్మలహృదయతంత్రులు మీటేది. కింద మట్టిలో పేడవాసనతో నేను ఇబ్బంది పడతానేమో అని అనుకుంటుందేమో.. పాపం పాలనురగవంటి తెల్లని పువ్వుల పానుపు లను రాల్చేది.

ఉదయం లేవగానే ఊగడం, అలా రోజంతా ఊగుతూనే ఉండడం నాకు ఇంకా గుర్తుంది. మావయ్య పిల్లలు, మేం కానుగ చెట్టుపై నుండి కింద పెటదిబ్బలోకి దూకి ఆడుకునేవాళ్లం. కానుగ కాయలు ఏరి, పగలగొట్టి పప్పులు తీసి అవ్వకు ఇస్తే.. అమె వాటిని ఎండబెట్టి, నూనె ఆడించి గుడిలో దీపానికి ఇచ్చేది. మా సంపూర్ణ పిలకాయలు తీసిన నూనె ఇది అని దేవళంలో అందరికీ చెప్పి మురిసి పోయేది. సెలవు దినాలన్నీ ఇలా ఊయల ఊగడం, బావుల్లో ఈదడం, తాటిముంజెలు తినడంతో వెళ్లిపోయేవి. ఎవరైనా తాటి ముంజలపై కప్పడానికి ఈ కానుగచెట్టు రెమ్మలు విరిస్తే భరించేవాణ్ని కాదు. ముంజలు చల్లగా ఉండడానికి కానుగ ఆకులు కప్పుతారు. అయినా మరో చెట్టు వెదుక్కోమనే వాడిని గానీ ఇంట్లో వాల్లను కూడా కోయనిచ్చేది లేదు. మా చెట్టు, మా పైనే అధారిటీనా అని మా మామయ్య, పిల్లలు అడ్డు తగిలినా సరే... ఒప్పుకునే వాణ్ని కాదు. అదంతే అని అలిగి వెళ్లిపోయే వాణ్ని. వేసవి అంతా నాకు తోడుగా కానుగ చెట్టు ఉండేది. మరో ఏడాదివరకూ నేను సజీవంగా ఉండగలిగే అనుబూతులను ప్రసవించేది.

ఊయల ఊగుతూ ఎన్ని ఊహల విహారాలు చేశానో, ఎన్ని మార్లు ఎంటీరామారావు తెరపై చేసే సాహసాలు నేను సునాయాసంగా చేసేశానో.. లెక్క లేదు. ఊయల ఊగుతుంటే.. ఒళ్లు తెలిసేది కాదు. నాలోని కల్పనలు చెట్టుకిందికి చేరగానే చిగుళ్లు వేసేవి. ఊయల ఊపుతూ కానుగ వంత పాడేది.

రాత్రి ఏడు గంటలకే కంచు గిన్నెలో వేడి అన్నం చారూ వేసుకుని చెట్టు కిందకి చేరితే... బువ్వ చల్లార్చి, తినమంటూ అలలా తల ఊపేది నా కానుగ చెట్టు. నులక మంచంపై వెళ్లకిలా పడుకుని చూసే నాకు ఎక్కడ వెన్నెల కనిపించదో అని ఒళ్లు చిళ్లులు పొడుచుకుని, ఆకుల సందులు ఇచ్చేది, పిల్లగాలికి కదిలే కొమ్మల చాటున దాగిన పున్నమి చంద్రుడు నన్ను చూసి అసూయ పడే వాడేమో.. మబ్బుల చాటున నక్కి, వెక్కి వెక్కి ఏడ్చేవాడని అమ్మమ్మ కథ చెపుతూ.... నన్ను నిద్రపుచ్చేది.

మనిషికీ, మానుకు మద్య ఇంతగా అనుబంధం ఉంటుందని నేను తెలుసుకోవడానికి మా వాళ్లు చేలా పెద్ద మూల్యం చెల్లించారు.

నా పదిహేనో ఏట మామయ్యలు వేరు పోయారు. విడిపోయిన అన్నదమ్ములు నివాసాల కోసం పచ్చని కానుగ చెట్టును కొట్టి, అక్కడో ఇళ్లు కట్టుకున్నారు. గృహప్రవేశానికి వెళ్లిన నాకు వెలితిగా కనిపించింది. కానుగచెట్టు లేకపోవడం కడుపులో దేవినట్టయింది. చినమావయ్య కొత్త ఇంటికి చేరుకున్నాడు కానీ నేను ఆ ఊరు నుండీ వచ్చేశాను. మళ్లీ గత ఇరవై సంవత్సరాలుగా అక్కడికి వెళ్లలేదు.

--000

resor och flygbiljetter onlineFree  Web Counter

3 comments:

సూర్యుడు said...

Cool :-)

Anonymous said...

good,keep it up:-)

Anonymous said...

good story