Saturday, August 15, 2009

టీ కొట్టు - కుప్పతెప్పలుగ పప్పు తిప్పలు - మన్నవ


రామనాధం హడావుడిగా కనిపించాడు. వాడెపుడూ అలా వుండడు. ఒద్దికైనవాడు. విషయం కనుక్కోవడానికి ఓ టీ తాగుదాం రా అని పిలిచాను. టీ చెప్పి.. ఏంటి విషయం అన్నాను. ఓ నిమిషం శూన్యంలోకి తదేకంగా చూచి... రెండు చేతుల్తో జుట్టు వెనక్కు దువ్వుకుని...
కొద్దిరోజులుగా ఎందుకో వీర బ్రహ్మేంద్ర స్వామి గుర్తుకు వస్తున్నాడు. కాలజ్ఞానం నిజమవుతుందనే ఊహ కంగారు పెడుతూ ఉంది అంటూ... ఇంతకూ ప్రజలు సామూహికంగా మోసపోతారని ఆ మహానుభావుడు చెప్పాడా, లేదా. అన్నది సందేహంగా ఉంది అన్నాడు. . ప్రభువులను ఎన్నుకుని రెండు నెలలు కూడా కాకుండానే.. వారు.. మన పప్పు తీస్తారనుకోలేదు. ఇదేమిటి ఇలా జరుగుతున్నది. ఆశ్చర్యపోవడానికి కూడా సమయం చిక్కడం లేదు. బాబూ ఇది రతనాలు రాశులు పోసి అమ్మిన చోటు, కానీ నేడు పప్పు కుప్పలకే దిక్కు లేకపోయనే అని పాత తరంవారు విచారించడంలో వింతేముందని సమాధాన పడ్డాడు. వాణ్ని అలా చూచి కదిలి పోయాను. అలాకాదు కావాలంటే ఇవ్వాళా సెల్ ఫోన్లు, ల్యాపుటాపుల అమ్మకాలు టాపు లేచి పోతున్న విషయం వారికి తెలియదనుకుంటా, లేక పోతే వారిలా ఆవేదన వ్యక్తం చేయరు కదా అంటే. కాకి లెక్కలు చూచాను గానీ, వాటిని మించి పోతున్న ఈ పప్పు లెక్కలు ఏమిట్రా అన్నాడు. కంది పప్పు కిలో వంద రూపాయలకు చేరుకున్నా, బియ్యం ధర రూ.40 దాటిపోయినా చీమ కుట్టినట్టయినా వుండని తోలుమందం పాలకులు పుడతారనీ, మన ఖర్మ కాలి అది మనం కళ్లార చూడవలసి వస్తుందని బ్రహ్మం గారు చెప్పలేదు కదా అన్నాడు. కిలో కంది పప్పుకోసం కుటుంబాలు కొట్టుకుంటున్నాయన్నాడు. అరకిలో పప్పుతో ముద్ద పప్పు వండుకుని, గరిటెడు ఆవునేయి వేసుకుని తినేవారట మా పెద్దవారు అని నా కొడుక్కి చెబుతోందిరా మా ఆవిడ. విడ్డూరంగా లేదూ అన్నాడు పాపం తల పట్టుకుంటూ. అవును మరి.. వాడి ఇంటికి వెళ్లినపుడు పప్పు, ఆవకాయ వద్దంటున్నా కొసరి వడ్డించిన వాళ్ల నానమ్మ కళ్లలో మెదిలింది. ఆవిడ గత యేడాది చచ్చి, బతికి పోయింది గానీ, బతికి వుంటే.. పండగ నాడు ముద్ద పప్పు చేసుకోవడానికి నెల బడ్జెట్ తలకిందులై పోతుదని బాధపడిపోయే మనవణ్ని చూచి గుండె పగిలి చచ్చేది. కంది పప్పు పచ్చడి తినడానికి ఆ వారం సినిమా మానుకునే తరాన్ని చూచి ఏమనుకోవాలో. వేడిఅన్నంలోకి కంది పొడి వేసుకునే అదృష్టంకోసం ప్రార్ధిద్దాం అంటూ కందిపప్పు వ్రతం చేసుకునే రోజులు వచ్చినందుకు ఏడవాలో, నవ్వాలో తెలియక, కళ్ల ముందు కుప్పతెప్పలుగ పప్పు తిప్పలు కనబడుతూ ఉంటే.. నేనూ మౌనుగా ఉన్నాను. ఇంతలో టీ అందించాడు కుర్రవాడు.

No comments: