Wednesday, March 7, 2012

aakaasadevar- paricyam

నగ్నముని తాజా విలోమ కథ ‘‘ ఆకాశదేవర’’ పరిచయం
- మన్నవ గంగాధరప్రసాద్‌

సభకు నమస్కారం
ముందుగా నేను సభలో ఉన్న చాలా మందిలో మెదిలే ప్రధాన ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఎందుకంటే, అది నాకుకూడా సమస్య కాబట్టి. ఆ అనుమానం తీరకుండా ముందుకు వెళ్లడం వలన ప్రయోజనం లేదు కాబట్టి. ఇవ్వాళ నగ్నముని  విలోమకథ ఆకాశదేవర పరిచయం అన్నారు.
సరే! నగ్నముని విలోమ కథ అంటున్నారు.  తెలుగు కథ, అరవ కథ, అనువాద కథ, ఆంగ్ల కథలు తెలుసుమరి. ..   విలోమ కథ అంటే ఏమిటి ?
విలోమమంటే తలకిందులుగా అని అనుకోవచ్చు.  మీకు శ్రీశ్రీ గుర్తున్నాడా!
ఇది చిలిపి ప్రశ్న
ఆయనను మరిచిపోయేదెవరు అంటారా!
సరే. పొలాలనన్నీ హలాల దున్ని గీతం గుర్తుందా, అది విలోమగతిలో  గేయం నడుపుతూ శ్రీశ్రీ సాధించిన గొప్ప ప్రయోగం.
మనం కుడి చేత్తో రాస్తాం. ఎవరైనా ఎడమ చేత్తో రాస్తే అదే విలోమం
రోడ్డుపై అందరూ ఎడమవైపు నడుస్తారు. ఎవరైనా కుడివైపు నడిస్తే  అది విలోమం
మామూలుకంటే విరుద్దమైనది అని స్థూలంగా ఈ మాటకు అర్థం. అంటే విలోమ కథలు కూడా మామూలు ఉబుసుపోక రాసిన కథలు కాదు. అందులోని శైలి, వస్తువు మీరు అనుకున్నట్లు అండవు.  దేవీప్రియ అన్నట్లు ‘‘చదువరులను జోకొట్టి నిద్ర పుచ్చడానికి రాసిన కథలు కావు’’
విలోమం అంటే  తల కిందులు. మన జీవిత విధానం అస్తవ్యస్తంగా ఉందనీ, మనవి విలోమ జీవితాలనీ రచయిత చెప్పదలుచుకున్నారు. భావ వ్యక్తీకరణలో, పాత్ర చిత్రణలో, కథా కథనంలో ఈ కథలు కొత్త పుంతలు తొక్కాయి.  ఆంగ్లంలో ఉండే యాంటీ- లిటరేచర్‌అనే పదానికి తెలుగులో విలోమసాహిత్యం అని పిలుస్తున్నాం. 
ఇక కథలోకి వస్తే....

ఇదో ఏట అనాధగా మారిన కథానాయకుడు  మిస్టర్‌ కారష్‌ అంచెలంచెలుగా జీవితంలో ఎదగడం ఈ కథ ఇతివృత్తం.  నైతిక విలువలకు  మంగళం పాడి అడ్డదారులు తొక్కి, అందలం ఎక్కి, అధికారం అందుకుని రాజకీయాలనీ, వ్యాపారాన్ని, సామ్రాజ్యాన్ని శాసించే నాయకుడు. ప్రపంచీకరణ నేపధ్యంలో పౌరుల స్వేచ్ఛను హరిస్తున్న దారుణ రాజకీయాలు, అందుకు అవకాశం ఇస్తున్న వ్యవస్థ ఈ కథలో అక్షరబద్దం చేయబడింది.   బహుశా ఆంధ్రప్రదేశ్‌ అనే ఒక రాజ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న రాజక్రీయకీడ ఈ కథకు పునాది కావచ్చు. కాకపోవచ్చు. పోలిక యాదృఛ్చికం కాకుంటే, కథ ఇంకా బాగా రక్తి కడుతంది. వర్తమాన పరిస్థితులను పరిశీలించే వారికి ఈ విషయం సులభంగా అవగతమవుతుంది.

ఈ  ఆకాశదేవరకథ గురించి ఆంధ్రజ్యోతి  దినపత్రిక సంపాదకులు శ్రీనివాస్‌ వివేచన ఆలోచింపజేస్తుంది. శ్రీనివాస్‌ అన్నట్లు కథలో  మార్మికత గాఢత మనం చూడవచ్చు. మనిషి మెదడులో మకాం వేసే విషపురుగుల గురించి కథ ఇది.  ఈ దేశంలో మనుషులు మనుషులుగా బతకడం లేదనీ,విశ్వాసాలు, విలువలు తలకిందులుగా నడుస్తున్నాయని రచయిత ఆగ్రహం మనకు కథలో కనిపిస్తుందన్నిది నిజం.
కథలో ఆకాశదేవర గురించి పురాతత్వవేత్త ఈశ్వర శర్మ పుస్తకం రాయడం- మేధారంగంలోని డొల్లతనానికి నిదర్శనం, ఆకాశదేవర గుడిలో ఎంత శూన్యం ఉందో ఈశ్వర శర్మలోనూ, కారష్‌ మిత్రుడు సత్యానంద్‌లోనూ అంతే శూన్యం ఉంది. నిజమే మన చుట్టూ చరుగుతున్న నాగరిత పేరుతో మన చుట్టూ జరుగుతున్న దోపిడీని తెలుసుకోలేని ప్రజలు. ప్రభుత్వాలు జలగల్లా పన్నుల రూపంలో సంపాదనను పీలుస్తున్నా గుర్తించలేని ప్రజలు శూన్యంలోనే జీవిస్తున్నారు.  వెరసి

ఒక రచయితగా నగ్నముని తపన ఈ కథలో కనిపిస్తుంది. ప్రజల్లో నిండుతున్న నైరాశ్యం పట్ల ఆవేదన కనిపిస్తుంది. భగవద్గీత  ఆరవ అధ్యాయంలో  (౬-౫) కృష్ణభగవానుడు చెప్పినట్లు  (ఉద్ధరేదాత్మ నా త్మానం నాత్మాన మవసాద యేత్‌, ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః  ఆత్మైవ రివురాత్మానః)  ప్రతి వ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవలెను, ఎవరికి వారే బంధువు, తనకు తానే శత్రువు. అన్నట్లు   మనలను మనమే (ప్రజలను ప్రజలే) ఉద్దరించుకోవాలనే  జీవన వేదం ఈ కథలో కనిపిస్తుంది.   కష్టజీవికి ముందు వెనుక ఉండే వాడు కవి అని శ్రీశ్రీ అన్నట్లు సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు కలత చెంది కలం పట్టిన కథకుడు నగ్నముని. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.  ఇది ఎవరికథో కాదు. మనందరి కథ. మన కళ్లుతెరిపించాలని తపిస్తున్న కథ. రాజకీయపు కుళ్లు తొలగించాలని పిలుపిస్తున్న కథ. నగ్నముని రాసిన ఈ  దేశం కథ.                

                                    నమస్సులతో...

No comments: