శ్రీరామ 8115
పేరడీగారడి
- మన్నవ గంగాధరప్రసాద్
పేరడి అండే గుర్తుకు వస్తోంది... అత్తారింటికి దారేది సినిమాలో వీడు ఆరడుగుల బుల్లెట్టు అనే పాట కు నేను సరదాగా పేరడీ రాశాను. ఆ పేరడీకి ఫేస్ బుక్ మిత్రుల నుంచీ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంలో పేరడీల గురించీ ఓ మాట...
పేరడీ ఇప్పటిది కాదు. చాలా పాతది. సినిమా పాటలకే ఇది పరిమితం కాలేదు. నిజానికి జలసూత్రం రుక్మిణీనాథశాస్ర్తి ని పేరడీ శాస్ర్తి అనే వారు. ఇక శ్రీశ్రీ కూడా మంచి పేరడీలు రాసిన వారే.
లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మార్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవేతప్ప నితఃపరంబెరుగ మన్నింపదగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
అన్న ఈ పోతన పద్యానికి కూడా పేరడీ ఉంది. ఆ అజ్ఞాత కవి ఎవరో తెలియదు కానీ, పద్యం చూడండి...
పూ విల్కాని సరోజబాణముల నంభోజారి మైచాయలన్
భావంబెంతయు డస్సె మేనుబడలెన్ తాపంబురెడ్డించె నే
నీవాడన్ మధురాధరంబొసగవే! నిక్కంబునన్నేలవే!
రావే మానిని! కావవే తరుణి! సంరక్షింపు చంద్రాననా!
అంటూ విరహ వేదనతో తన ప్రేయసిని ప్రార్థిస్తున్నాడు ఈ ప్రేమ భక్తుడు.
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ!
అన్న సుమతి శతక కారుని పద్యానికి శ్రీశ్రీ పేరడీ చూడండి...
ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా!
ఏదేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరహరణోద్యోగం
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహ సిక్తం అన్న శ్రీశ్రీ కవితకు మాచిరాజు దేవీ ప్రసాద్ పేరడీ చదవండి...
ఏ రోడ్డు చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
రహదారీ చరిత్ర సమస్తం
ధూళి ధూసర పరిన్యస్తం
రహదారీ చరిత్ర సమస్తం
యాతాయాత జనసంయుక్తం
రహదారీ చరిత్ర సమస్తం
పథిక వాహన ప్రయాణసిక్తం.
0
0
0
No comments:
Post a Comment