Saturday, July 25, 2015


ఊహలగానుగ
- మన్నవ గంగాధర ప్రసాద్‌ (25-07-2015)మౌనంగా రోధించడం ఎలాగో సాధన చేస్తున్నాను నేస్తమా!
జీవన చిత్రంలో రంగులు వెలిసిపోకుండా కాపాడుకోవడానికి అదొక్కటే దారి కదా!
అందుకే. . . !
కంటినీటి సరస్సులు మొగ్గతొడగకుండా కాపు కాస్తున్నాను.
ఆవేదన గుండెగోడలు మీరకుండా అడ్డుపడుతున్నాను.

చర్మం దిగువన
నిస్తేజం పేరుకుని పోతోంది
నిస్సారమయిన అనుభవాల వనిలో వెంట్రుకలు అందుకే తెల్లబడుతున్నాయి.
సమాజాన్నంలోని సువాసనలను నాలుకలుకలు గుర్తించ లేక పోతున్నాయి.
(నా లుకలుకలు, నాలుక లుకలులు)
దివారాత్రాలు అహోరాత్రంగా ఒంటరి యాగాలు చేస్తున్నాయి.
దింపలేని ఊహల గానుగల బరువులు మోస్తున్నాయి.

అందుకే నేస్తం
పరివర్తనలేని వర్తమానాన్ని తిలికిస్తూ
అజ్ఞాతంగా విలపిస్తున్నాను.
ఎవరికీ వినిపించకుండా జీవిస్తున్నాను.
ఎవరికీ కనిపించ కుండా నడుస్తున్నాను.

---0---

No comments: