Monday, June 15, 2015

విన్నామాట..!
... మన్నవ గంగాధరప్రసాద్‌

ఇది
నది వంటి జీవనయానం
మది గది దాటని వైనం

మౌనంగా రోధించలేని సంకెళ్లు..
గుండె చుట్టూ మొలుస్తున్న వాడి ముళ్లు..
ఆలోచనలను బంధిస్తున్న అజ్ఞాత జ్ఞాపకాల ముళ్లు..

ప్రయాణం కొనసాగుతోంది
ప్రయాసలు వికసిస్తున్నాయి
ప్రమోదం ఆస్తమిస్తోంది
ప్రభాతాలు అంతరించిపోతున్నాయి

మర చెంబులోకి కుంచించుకుపోతున్న విశాలత్వం
చెర చిరునామాగా మారుతున్న మానవత్వం
పొర పొరలుగా విడిపోతున్న  జీవనమాధుర్యం
తర తరాలుగా  అదే వైదుష్యం ప్రదర్శిస్తున్న ఆహార్యం

కంటిని విడిచి జారిపడని నీటి చుక్క
మంటిని తాకడానికి జంకుతున్న వాన చుక్క
మౌన మధ్యాహ్నాలలో విలపిస్తున్న తులసిమొక్క
ఈ వర్తమానావమానవాటికలో దహనం కాని తిక్క

మన్నవా..!
ఇది విన్నావా!!
జీవితం అంటే ఏమిటో...

మరణం చెబుతోంది, రా!... వింటావా?

No comments: