Friday, May 8, 2009

చెన్నయ్ కవితలు.. ..

మెరీనాలో మరమనిషి ..!

అది సువిశాలమైన సైకత తీరం,
అది రమ్యమైన మోరీనా హృదయం.
నీలిచీరకు నేసిన తెల్ల అంచులు
ఎగిరి, ఎగిరి పడుతున్నాయి.
నులివెచ్చని బంగారు ఇసుక సుఖాల ఒడ్డున
అక్కడ ఓ మరమనిషి.
నలిగిపోయిన మరమరాలను నములుతున్నాడు.
చీలలు చెదలుపట్టి,
రేకులు తప్పుపట్టి,
చిల్లులు పడ్డ అతుకులనుండి,
మనసు చుక్కలు చుక్కలుగా కారి,
గడ్డకడుతూ ఉంది.
హృదయం దుమ్ముకొట్టుకుపోయి
కిర్రు కిర్రు మంటూ, కొట్టుకుంటోంది.
ఆహ్లాదాన్ని అనుభవించలేని క్లేదం
స్వార్థంతో ఘనీభవించిన ప్లీహం
రాగి రేకుల చర్మం స్రవించే స్వేదం
శిధిలావస్తకు చేరుకున్న నిర్వేదం
నిండా.. ..
లక్ష లక్షకంతల గుంతల వింత ఆశలు.

- మన్నవ.


పానగల్ పార్కు

నిటారుగా నిలబడి
కాలాన్ని కొలుస్తున్న అశోక చెట్లు.
వాడికి వాడవాడలా వేలాడుతున్న
మానవ హృదయాలు.
మొదళ్ల వద్ద మేటవేసిన మెదళ్లు.
పార్కు దారులవెంట వెదుకుతున్న గోళ్లు.
గేటు అంచులపై నుండి బజారులోకి ఒలుకుతున్న కళ్లు.
పానగల్ పార్కు
దగ్గరగా చూస్తే నాకు ఇలానే కనిపిస్తోంది.
లీలగా ఎక్కడో
ఘంటసాల గొంతు,
కృష్ణశాస్త్రి పలుకు,
వెండితెర తొలిమెట్టుపై పాకుతున్న మేకప్ లేని ముఖాలు
కనిపిస్తాయి.
ఇక్కడెక్కడో విరిసిన కల్పవృక్షం సమాధికోసం వెదుకుతాను
పలచబడ్డ గాలి వీస్తున్నా...
నాగయ్య విగ్రహానికి పట్టే చెమట కనిపిస్తుంది.
పలుమార్లు పేరుకున్న గచ్చులకింద దాగిన
ఒయాసిస్సు వంటి పాత పాదాల గుర్తులను
స్పృశిస్తాను.
తలవంచి నమస్కరించి వెళ్లిపోతాను.
- మన్నవ.

వడపళని

దూరంగా
మీకు కట్, స్టార్ట్ కేకలు
వినిపిస్తున్నాయా. .. . లేదా..
ష్.. .. .. నిశ్సబ్దం.
మహామహులు నేడు నిద్రిస్తున్నారు.
దయచేసి రేపు రండి.
ఓ, తప్పకుండా
స్టూడియోగేట్లు తెరిచే ఉంటాయి.
కిరీటాలు, గదలు, రథాలు
వాకిళ్లు, లోగిల్లు,
షూడింగులూ పదిలంగా ఉంటాయి.
కాసేపు కళ్లు మూసుకుంటే..
చందమామ, విజయపతాక, భరణి,
గతం సజీవమే కదా.. జ్ఞాపకాలలోయలో.
పద
గ్రీన్ లైట్ వెలిగింది.
- మన్నవ.

ఆకాశవాణి

గోడలు ఎత్తుగా ఉన్నా
నా ఊహలు దాటేస్తాయి.
ఇక్కడ
మనసుకు రెక్కలు మొలుస్తాయి.
నాతరానికి ముందు
జీవితం ఇక్కడ కదలాడేది.
పలురకాల రుచులు సంతరించుకున్న
సజీవ పాత్రలు
మైకులముందు ఆవిష్కృతమయ్యేవి.
ప్రతి ఇంటికీ ప్రసారమయ్యేవి.
గుండె తలుపులు తట్టేవి.
జాతి చిలికిన వెన్న
కాగి, మరిగి తయారైన మహా మనసు
కలాలు ఇక్కడ ఆవిష్కరించిన
వైవిద్యం విహ్వలత కలిగిస్తుంది.
రేడియో
మనసుకు తెలియేది.
ప్రపంచాన్ని చూపేది.

- మన్నవ.

3 comments:

బొల్లోజు బాబా said...

అద్బుతమైన ఇమేజెస్ ఉన్నాయి మీ కవిత్వలలో.
నీలిచీరకు నేసిన తెల్ల అంచులు: సముద్రపు అలలకు ఎంత చక్కని దృశ్యావిష్కరణ

హృదయం దుమ్ముకొట్టుకుపోయి: గొప్ప ఊహ.

కాలాన్ని కొలుస్తున్న అశోక చెట్లు: అవును కాలాన్ని చెట్లు అంచనా వేసినట్లుగా మనుషులు చేయలేరు. గడియారాలు, పంచాంగాలు కావాలి.


గోడలు ఎత్తుగా ఉన్నా
నా ఊహలు దాటేస్తాయి.: ఊహలు అనే అమూర్తభావనను, ఒక చిన్న ప్లెయిన్ మూర్తభావనతో లింక్ చేసి చెప్పటం ఒక అద్భుతం.
ఊహలు గాల్లో విహరిస్తున్నాయి, మెరుపు ఊహలు, ఊహలు పరిగెట్టాయి వంటి బీటెన్ వ్యక్తీకరణలలో లేని ఒక క్లారిటీ ఒక చిన్న లింక్ తో సాధ్యపడింది. బాగుంది.

గూడ్ పొయిట్రీ
ధన్యవాదములు
అభినందనలు
బొల్లోజు బాబా

కొత్త పాళీ said...

సెబాష్!
చాలా బాగున్నాయి

Anonymous said...

very fine poetry, good.