ఉరిపోసుకున్న సాయంత్రంలాగా ఉంది ఆ గది.
గాలినిండా గాఢమైన శవం వాసన.
కనులు పెరికి అరచేతుల్లో పెట్టుకుని చూచినా, కనిపించనంత చీకటిగా ఉంది ఆ గది.
నాకు వెన్నులో చల్లని రైలు పరుగెడుతున్నట్టు ఉంది.
చెవులవెనుక కారుతున్న చెమట వాసన కొత్తగా ఉంది.
అరచేతుల్లో తడి. . . పొడి పొడిగా తగులుతోంది.
అయినా, శ్వాస కొద్దిగా గట్టిగా లోనికి పీల్చి, ఎడంచేత్తో.. కుడువైపు భుజంపై తట్టుకుని, నాకు నేనే థైర్యం కూడబలుక్కున్నాను.
ఓటేయడానికి లైన్లో నిలుచున్న పేద ఓటరులా ఉంది నా పరిస్థితి.
గదిలో గతంలో ఉన్నవాళ్లు వదిలివెళ్లిన గుర్తులు కాళ్లకు అడ్డు పడుతూ, మరింత భయపెడుతున్నాయి.
నాలుగు అడుగులువేశానో లేదో- మోకాలు చిప్ప టఫీమని పగిలినంత పనైంది.
ఏంతగిలిందో చూడలేను. బాధతో కుయ్యో అనుకునే లోగానే.
బొద్దింకలాంటిది ఏదో ఎగిరి మూతిమీద పడింది.
మొత్తం నెత్తురంతా ఫ్రిజ్ లో పెట్టినట్టు గడ్డకట్టుకు పోయాను.
చింతనిప్పులా మారిన కళ్ల వెలుగులో మసక మసకగా కనిపిస్తున్నవి ఏవో.. గుర్తుకు రావడం లేదు.
ఇంతలో కాళ్లపై పందికొక్కులాంటిది పరుగుతీసిందేమో, శ్వాసని మూటగట్టుకుని, గట్టిగా పట్టుకుని, ఒక్క గెంతులో బయటపడి గది తలుపు మూసేశాను.
కాస్త నెమ్మళించి, నమ్మకం మాత్రలు రెండు మింగి చూస్తే.. అది నాగదే. నా పాత గది. నిరుద్యోగ జీవిక గడిపిన కొట్టం గది. దాని జ్ఞాపకమే ఇంత భయంకరంగా ఉంటే.. అపుడు నా జీవితం ఎంత భయంకంరంగా ఉండేదో మీరు ఊహించుకోండి.
--000--
6 comments:
నిరుద్యోగం అంత భయంకరంగా ఉంటుందా!!!
ఇంత భయపెట్టేశారేంటండీ బాబూ ! చదివితేనే ఇలా ఉంటే ...నిజంగా ఎదురైతే ... :-(
వామ్మో...
అద్భుతంగా వుందండీ కథనం. శీర్షిక బాగా నప్పింది. అభినందనలు.
ఆకలి రాజ్యం సినిమా గుర్తుకొచ్చింది చదవగానే. సినిమా చివర్లో ఎంత ఆశావహంగా ముగిసినప్పటికీ మా ఇంటర్మీడియట్ రోజుల్లో దాన్ని చూసి వణికిపోయాం. జీవితం ఇంత భయానకంగా ఉంటుందని మాకు అప్పడే తెలిసింది. తర్వాత దాదాపు 30 ఏళ్లు గడిచాయి. అయినా కొట్టు గది పేరుతో ఇంతగా భయపెట్టడం న్యాయమేనా?
మీ అభినందనలకు నమస్సులు
సాహితీ సహృదయానికి వందనాలు
విరియాలి సదా ఈ స్నేహసుమాలు
- మన్నవ
Post a Comment