Saturday, May 1, 2010

మా వూరు





వెన్నెలలో ఆటలు మరచిపోలేనివి...

(mannava gangadhara prasad)

డాక్టర్‌ చంద్రలేఖ (63), వృత్తి రీత్యా చిన్న పిల్లల వైద్యురాలు. కానీ ప్రవృత్తి మాత్రం మానవీయ కోణం. గోదావరి నదీ తీరంలోని ఓ గ్రామంలో జన్మించినప్పటికీ, చిన్నతనంలో నాన్నగారి రైల్వేఉద్యోగం కారణంగా తమిళనాడులోని పలు ఊర్లు తిరిగే వారు. అయినా, ఏడాదికి మూడు, నాలుగు సార్లు అమ్మమ్మ ఊరు వెల్లే వారు. సెలవుల కోసం చకోర పక్షుల్లా వెదికే కళ్లకి, కాకినాడ కనిపించగానే హాయిగా అనిపించేది. గుమ్మపాలు, తాజా కొబ్బరి బోండాంలు, పళ్లు, పూలు, గోరింటాకు, పిండివంటలతో సిద్దంగా ఉండే అమ్మమ్మ అనురాగం గుర్తుకు వచ్చేది. మనసు రైలు కంటే ముందుగానే ఊరు చేరిపోయేది. కానీ నేడు పిచ్చుక గూడు వంటి అపార్టు మెంట్ల్లలో ఉంటున్నాం. గ్రామాలలో పరిస్థితికూడా మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్‌ ఫ్యామిలీలు బాల్యాన్ని కూడా హరిస్తున్నాయని ఆవేదన చెందుతారు. మా ఊరు కోసం ఆన్‌లైన్‌తో సంభాషిస్తున్నపుడు ఆ ఊరి మట్టి వాసనలు అనేక సార్లు ఆమె కళ్లలో ద్రవీభవించాయి. ఆ జ్ఞాపకాల తడి ఆమె మాటల్ల్లోనే...

మాది కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం. మా ఊరి పేరు ‘గండ్రేడు’. మా నాన్న పేరు రాజేశ్వర రావు, అమ్మ భారతీదేవి. ఏప్రిల్‌ 24, 1947లో నేను మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పుట్టాను. మా తాతయ్య పేరు బాపిరాజు. ఆయనకి 12 మంది సంతానం.ఐదుగురు అమ్మాయిలు, 7గురు అబ్బాయిలు. మా అమ్మ రెoడో కూతురు. నాకు పదేళ్లు వచ్చే నాటికి మా పిన్నీలు, మామయ్యల పిల్లలు అందరం కలిసి దాదాపు పాతిక మంది ఉండేవారం. సెలవులు వచ్చాయంటే వెంటనే అందరూ అమ్మమ్మ వాళ్ల ఊరు చేరిపోయే వాళ్లం. ఇక సందడే సందడి. ఆటలు, పాటలు, సరదాలు ఆ రోజులు మళ్లీ రావు. మా తాతగారికి చాలా గేదెలు, ఆవులు ఉండేవి. మేం ఆవుపాలు పితికి అలాగే, గుమ్మపాలు తాగేసేవాళ్లం. పొలంలో అరటి, చెరకు, వరి, కొబ్బరి వంటివి పండించేవారు. ఇక మా ఇంటికి ఆనుకుని రెండు పెద్ద తోటలు ఉండేవి. అందులో సన్నజాజులు, మల్లెలు, జాజులు, రోజావంటి పూలచెట్లు, వివిధ రకాల పళ్ల చెట్లూ ఉండేవి. ఉదయం నిద్రలేచి ఆటలకని తోటలోకి వెడితే.. మ«ధ్యాహ్నం భోజనానికి మమ్మల్ని వెతుక్కుంటూ అమ్మమ్మ రావలసిందే. అలా పొద్దు ఎరక్కుండా ఆడుకునే వారం. కోతి కొమ్మచ్చి, దొంగాపోలీసు, వామన గుంతలు, చింతపిక్కలాట, తొక్కుడుబిల్ల ఇలా పిల్లలం తోటలో అదుపు లేకుండా విహరించేవాళ్లం. ఇక పెదనాన్నలు, చిన్నాన్నలు వారితో ఆటలు, సరదాలు చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆపార్టుమెంట్లు వచ్చేసి, పిల్లలకు ఆడుకోవడం అంటేనే తెలియకుండా పోతోంది. మేం ఊరు వెళ్లా మంటే అరవ పిల్లలు వచ్చార్రా! అంటూ అందరూ మా చుట్టూ చేరే వారు. మాకు తెలిసిన అరవ పాటలు పాడించుకుని ఆనందించే వారు. చిన్నతనంలో ఎంత దూరమైనా నడిచి వెల్లేవాళ్లం, ఆ నడక ఎంత ఆనందించేదో ఇప్పటికీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. మా చిన్నతనంలో వేసవి సెలవులు చాలా ఎక్కువ వచ్చేవి. ఆ అన్ని రోజులూ ఊర్లో ఉండే వాళ్లం.

రోజూ విందు భోజనమే..
సెలవులు ఉన్నన్ని రోజులూ.. రోజూ ఓ విందు భోజనమే. గారెలు, బూరెలు, బొబ్బట్లు, పుళిహోరా, దద్దోజనం, పాయసాలు, రకరకాల మామిడి పళ్లు సిద్దంగా ఉండేవి. కంది పచ్చడి వంటివి సరేసరి, పనసపండుతో అమ్మమ్మ చాలా రకాల వంటకాలు చేసేది. కొబ్బరి వేసి ఆమె చేసే చలివిడి ఎంతో రుచిగా ఉండేది. పిల్లలం నాకంటే నాకని తగువులాడుకునే వారం. ఇక వేసవిలో అయితే, కొత్తావకాయ అన్నం పెద్ద గిన్నెలో కలిపేది. దాదాపు 20 మంది పిల్లలు కదా, అందరికీ గోరుముద్దలు పెట్టేది. గోంగూర మాకు ఫేవరేట్‌ డిష్‌. కొలవులు, పండగలకు వడపప్పు, పానకం ఉండనే ఉండేవి. చాలా తరచుగా అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. పర్వదినాల్లో బంగారం పూలు తాపడం చేసిన వెండి కంచాల్లో తినేవాళ్లం.

నో గుడి, నో పూజలు..
మా నాన్న గారు చిన్న తనం నుండీ తార్కికంగా ఆలోచించే వారు. ఆయన బ్రహ్మ సమాజం అనేసరించే వారు. అందులో భాగంగా విగ్రహారాధన నిషేధం. భగవంతుడు సర్వవ్యాపితుడు అనేది వారి నమ్మకం. పూజాధికాలకు వ్యతిరేకం. అందువలన మా చిన్నతనంలో ఆలయాలకు వెళ్లే వాళ్లం కాదు. ఊర్లో గుడి ఉన్నా. ఉత్సవాలకు హాజరయ్యేవారం కాదు. పండుగలు కూడా మామూలుగానే జరుపుకునేవాళ్లం. విశేషంగా ఏమీ ఉండేవి కాదు. నవరాత్రి సందర్భంగా జరితే ఉత్సవాలను చూడడానికి మాత్రం పిల్లలు వెళ్లే వాళ్లం. అలాగే బొమ్మల కొలువు పెట్టుకునేవారం. రాధాకృష్ణుల పెళ్లి పిల్లలు సరదాగా చేసేవారు. బొమ్మలకు అలంకరించడం, ఆటలు పాటలు బాగా ఉండేది.

ఈత సరదా...
నాకు పదేళ్ల వయసులోనే మా నాన్న గారు ఈత నేర్పించారు. ఊర్లో ఉంటే ఈతకు వెళ్లే వాళ్లం. బావులు, చెరువులు, గోదావరిలో ఈదే వారం. 8వ తరగతి చదువుతున్నపుడే నాన్న మాకు సైకిల్‌ తొక్కడం కూడా నేర్పించారు. మగ పిల్లలతో పోటీగా సైకిలు తొక్కడం ఓ సరదా. సినమాలు ఈ సరదాలు ఉండేవి కాదు. మద్రాసు వచ్చినపుడే సినిమాలు, బీచ్‌ కి వెళ్లడం. ఊర్లో అవన్నీ ఉండేవి కాదు. గ్రామంలో రాత్రి వెన్నెలలో ఆడుకున్న ఆటలు ఉన్నో. ఇవ్వాళ ఈ విషయాలు ఎవరికీ తెలియవు.

వీరేశలింగం ఆదర్శం..
మా తాత తమ్ముడు, అంటే మా చిన తాత. వీరేశలింగం పంతులుగారు స్థాపించిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. అందువలన మా కుటుంబంలో కొంత ఆదర్శవంతమైన వాతావరణం ఉండేది. మాకు పెద్దబాల శిక్ష ఇచ్చి చదవ మనే వారు. నేనూ, మా అక్కా శ్రద్దగా చదివేవారం, కానీ మా తమ్ముడు డుమ్మా కొట్టి ఆటలకు వెళ్లేవాడు. పద్యాలు కంఠతా పట్టడం అలవాటు చేశారు.

వాలుజడలు..
మల్లె పూల కాలంలో మాకు పూలజడ వేసేవారు. తలనిండా, జండపై నుండీ కింది వరకూ పైలతో అలంకరించేవారు. అమ్మమమ్మ తన వడ్డానం. చంద్రహారం, కాసుల మాల మాకు వేసేది. పాపిటబిల్లలు, చెవి దుద్దులు అలంకరించే వారు. ఇవి లేనపుడు రెండు జడలు వేసి చామంతి పూలు పెట్టుకునే వాళ్లం. గోరింటాకు పుట్టుకోవడం అంటే అదో పెద్డ ప్రహసనం. ఇప్పట్లా అంట్లో కొనే మెహందీ కాదు కదా. ఉదయమే పెరట్లోని గోరింట ఆకు కోసి, దానిలో అన్ని దినుసులూ వేసి రోట్లో రుబ్బడం. రుబ్బిన వారి చేయి ఎర్రగా పండిపోయేది. పిల్లలం అక్కడ చేరి ఎవరు ముందు పెట్టించుకోవాలో పందేలు వేసుకునే వాళ్లం. రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుంటే ఎవరో ఒకరు ముద్దలు చేసి అన్నం తినిపించే వారు. గంటో రెండు గంటలో ఉంచుకోవడం గగనంగా ఉండేది. వెంటనే కడిగేసుకుని, పండిన చేతిని చూసుకుని మురిసిపోయేవాళ్లం. నాకు ముగ్గులు వేయడం మా పెద్ద మావ కూతురు నేర్పేది. ముగ్గులు వేయడంలో పోటీ పెట్టే వారు. గెలిచినవారికి గ్రేడింగ్‌ ఇచ్చేది. తరువాత బహుమతులు ఉండేవి. చిన్నతనంలో నేను డ్రాయింగ్‌ బాగా వేసేదాన్ని. మా అక్కయ్యల వద్ద అల్లికలు, కుట్లు కొన్ని నేర్చుకున్నాను.

ఊర్లో అందరు పిల్లలు కలిసి ఆడకునే వారం. గుడివద్ద, తోటల్లో రాత్రివే్లళలో కూడా ఆడుకునే వారం. ముఖ్యంగా వెన్నెల రాత్రుల్లో ఇంద మంది పిల్లలు కలిస్తే.. ఎంత సందడిగా ఉండేదో. మా చెల్లెలు ఒకటి పూలంటే చాలా ఇష్టం. రెండు జడలు వేసి తల నిండాపూలు పెట్టుకోవాలని మారాం చేసేది. ఎన్ని పూలైనా పెట్టుకునేది. అమ్మమ్మ నగలు కూడా అదే వేసుకునేది. పండుగలంటే.. సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టడం, తోరణాలు కట్టడం, హరిదాసులు రావడం, గంగిరెద్దుల ఆటలు సరదాగా ఉండేది. తోటనుండి తెచ్చిన అరటి పండ్లు పండకుండానే, పండిపోయాయి, మెత్తబడ్డాయని మామయ్యను ఏమార్చి తినేసేవాళ్లం. తాతయ్య స్నేహితుల ఇల్లకు వెళ్లే వాళ్లం. బళ్లపై ప్రయాణం మరచిపోలేని అనుభవం.

కాలేజీలో చేరే వరకూ గ్రామంతో అనుబంధం కొనసాగింది. తరువాత మెడిసిన్లో చేరడం, ఎండీ చడవడం.. జీవితం బిజీ అయ్యింది అంటారు డాక్టర్‌ చంద్రలేఖ. కీల్పాక్‌ వైద్య కళాశాల నుండి 1971లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో డీసీహెచ్‌ చేసిన తరువాత, తొలిసారి తిరువణామలై జిల్లాలో కీల్‌పెన్నత్తూర్‌లో 1973లో చిన్నపిల్లల వైద్యురాలుగా ఉద్యోగంలో చేరిన డాక్టర్‌ చంద్రలేఖ, 2003లో ఎగ్మూర్‌ హాస్పిటల్లో జెనిటిక్స్‌ అండ్‌ పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం చిన్న పిల్లల వైద్యురాలుగా పైవేట్‌ ప్రాక్టీసు చేస్తున్నారు.
=============

5 comments:

kanthisena said...

డియర్ గంగాధర్ గారూ,
మనుషులుగా మనం ఏమేం కోల్పోయామో, ఇంకా కోల్పోతూ ఉన్నామో.. ఏ ఒక్క అంశాన్ని వదలకుండా పూస గుచ్చారు చంద్రలేఖ గారు. మన ప్రాంతంలో అన్ని రకాల వంటలు తినే భాగ్యం లేదనుకోండి.. కానీ వెన్నెలకుప్పలు కూడా ఆడుకున్నారామె. అవంటే ఏమిటో ఈరోజు ఎవరికీ తెలియవు. మనందరి బాల్యాన్ని ఆమె తన అక్షరాలలో పెట్టారు. మంచి ఇంటర్వ్యూ చేసిన మీకూ, చక్కగా పంచుకున్న డాక్టర్ గారికి అభినందనలు. మరి బాల్యంలో ఇన్ని మదురానుభూతులను మనతో పంచుకున్నారు కదా.. మరి చంద్రలేఖ గారికి చందమామ పత్రికతో పరిచయం లేదా.. వారి కుటుబంలో చందమామ ఉండేది కాదా.. దయచేసి కనుక్కోండి. ఉంటే మాత్రం వారి చందమామ జ్ఞాపకాలు చందమామ వెబ్‌‍సైట్‌కోసం, చందమామ బ్లాగు కోసం కావాలి. మరోసారి వారికీ, మీకూ మనఃపూర్వక అభినందనలతో..
రాజు.

Anonymous said...

fine sir,
baalyam emito ruci coopincaaru.

Anonymous said...

childhood was an unforgetful wonder

babu@gmail.com said...

మా ఊరు, కథనం హృదయానందం కలిగించింది.
అమ్మమ్మ చేత గోరుముద్దలు తిన్నవారికి, కాలాతీతమైన జ్ఞాపకాల వరద ముంచెత్తింది.
బాగుంది సర్‌,
ఇది కథ.. లేక డాక్టరు గారితో ఇంటర్యూనా తెలుపగలరు.
... బాబు జికే

Unknown said...

sir,
doctor garu valla villiage gurinchi baga cheparu. naku chala happy ga vundi yendukante madi gandredu kabati my name is ramkumar