Saturday, May 8, 2010

మా ఊరే ఓ పండుగ


కాలం ఎవరికోసమూ ఆగదు. నిరంతరం సాగిపోయే కాలప్రవాహంలో జ్ఞాపకాల తీపిగురుతులకోసం వెతుక్కోవలసిన దురవస్ధ మనిషికి తప్పదు. మధురమైన జ్ఞాపకాలే చిరకాలం వెంటాడుతాయి. మనం నిదురపోతూ ఉన్నా, అవి ఆలోచనల పొరల్లో కదలాడి, గుండె తడిని గురుతు చేస్తూ ఉంటాయి. ప్రతి మనిషికీ ‘బాల్యం’ అలాంటిదే. బతుకు తెరువుకోసం నగరాల ఖార్కానాల్లో కుమిలి పోతున్న ఆధునిక జీవికి తన చిన్న నాటి పల్లె గురుతుకు వస్తే.. అది పండుగ. నిజంగా అదే పెద్ద పెండుగ. అలాంటి పండుగలాంటి ఓ గ్రామీణ జీవన సౌరభాలను మనతో పంచుకోవడానికి రేడియో తాతయ్యగా ప్రసిద్దమైన ఉమామహేశ్వరరావు (95) మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం...

మాది, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం తాలూకా పరిధిలోకి వచ్చే పెనుమంచిలిపాటి అగ్రహారం. ఇది పోడూరుకి దగ్గర ఉంటుంది. అది ఇవ్వాల ఎలా ఉందో నాకు తెలియదు. కానీ మీరు రావడంతో, నేను 85 సంవత్సరాల వెనక్కి రీళ్లు తిప్పి, నా ఫ్లాష్‌ బ్యాక్‌ గురుతు చేసుకుంటున్నాను. అప్పట్లో మా వూరు ఓ కుగ్రామం, జనాభా వందలోపే.. అందులో దాదాపు అందరూ మా బంధువులే. పెద్ద ఉమ్మడి కుటుబం విడిపోయి గ్రామంగా ఏర్పడినట్టు అండేది మాకు. మా నాన్నకు కొంత పొలం, ఆలయ అర్చకత్వం ఉండేది. మా యింటికి సమీపంలోనే విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి అలయం ఉండేది. చిన్న గ్రామం, అందులో ఓ ఆలయం, దగ్గరలో ఓ అందమైన చెరువు, చుట్టూ పంటపొలాలు, చింత, వేప, కానుగ వృక్షాలు.. ఇది నా చిన్నతనంలో మా వూరు. నాకు మా వూరంటే విపరీతమైన అపేక్ష, ఆసక్తి, అవ్యక్తమైన బంధం. పొలాలకు దగ్గరగా, గుడి సమీపంలో తూర్పుముఖంగా మా ఇళ్లు ఉండేది. ప్రతి ఉదయం నిద్రలేవగానే సూర్యనమస్కారం చేసుకునేవాళ్లం. ఆలయం చుట్టూ పెద్ద ప్రహరీ ఉండేది. అందులో ఎన్నో పూల మొక్కలు. తెలుపు, ఎరుపు, పసుపు గన్నేరు పూలు విరవిగా పూచేవి. ఆ పూలను కోసి విశ్వేశ్వరుణ్ని అర్చించేవాళ్లం.

గ్రామంలో రెండో, మూడో రాతి స్ధంబాలు ఉండేవి. రోజూ సాయంత్రం వాటిపై ఓ వ్యక్తి నూనె దీపాలను వెలిగించే వాడు. ఊరికి మధ్యలో ఓ చేదబావి ఉండేది. గ్రామమంతా అక్కడి నుండే మంచినీరు తెచ్చుకునే వారం. స్నానాలకు, దుస్తులు చలువ చేయడానికి సమీపంలోని కాలువకు వెళ్లే వాళ్లం. దాన్నే నక్కల వంక అనే వాళ్లు. అక్కడ దోభీఘాట్‌లో బట్టలు ఉతికే చాకలి వారు, వారి శ్రమైకజీవనం నన్ను ఆకర్షంచేది. గ్రామానికి దగ్గరగా చెరువు ఉంది. అందులో అన్ని కాలాల్లోనూ ఎర్రకలువలు నిండుగా ఉండేవి. ప్రతి ఆదివారం మా ఊరికి 3 మైళ్ల దూరంలో ఉన్న పెనుకొండలో సంత జరిగేది. మా నాన్న గారు వారానికి కావలసిన వెచ్చాలు, కూరలు ఆ సంత నుండీ తీసుకువచ్చే వారు. అంత దూరం ఆయన నడిచే వెళ్లేవారు. వాహనాలు ఏవీ ఉండేవి కావు.

నాకు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకూ మా గ్రమంలోనే ఉండే వాడిని. చిన్న తనంలో చదువుపై ఆసక్తి ఉండేది కాదు. బడికి వెళ్లడానికి రోజూ మారాం చేసేవాణ్ని. ఉదయం అమ్మ కాళ్లకు చుట్టుకుని ఇంట్లోనే ఉంటానని ఏడ్చేసే వాణ్ని. నన్ను చూచి మా అమ్మగారు దిగులు పడేవారు. చదువుకోకపోతే ఎలా నాన్నా అని నెమ్మదిగా చెప్పేవారు. వీడు పెద్తై ఎలా బతుకుతాడమ్మా అని చాలా సార్లు అనుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. చివరికి ఓ పూజారి ఇంటికి వచ్చి నన్ను బడికి తీసుకు వెళ్లేవాడు. అక్కడ కచిక బూడిద పై చూపుడు వేలుతో ఓనామాలు రాసేవాణ్ని. తరువాత మాతో పెద్దబాల శిక్ష చదివించే వారు. అంతే బడిలో పెద్దగా చదువుకున్నట్టు గుర్తు లేదు కానీ, మా మావయ్య ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. ఆంధ్రనామసంగ్రహం చదివినట్టు గుర్తు. ఇంకా చాలా శతకపద్యాలు కంఠతాపట్టేవాళ్లం.

 మా ఇంటికి ఎదురుగా గ్రామ కరణం ఇల్లు ఉండేది. అందులో నా ఈడు వాడు.. వాడి పేరు కూడా ఉమా మహేశ్వరరావే ఉండేవాడు. నేనూ వాడూ ఓ జట్టు. ఇతరులతో అంతగా కలిసేవాళ్లం కాదు. వాళ్లకు చాలా పొలాలు, అవీ ఉండేవి . వేసవిలో పొలాలకు వెళ్లి వాళ్ల పాలేర్ల సాయంతో తాటి ముంజెలు దింపించే వాళ్లం. ఇద్దరూ ఎన్ని గెలల తాటిముంజెలు తినే వాల్లమో.. మూడుకళ్ల ముంజెల కోసం పోటి పడే వాళ్లం. పొలాల వెంబడి రోజల్లా షికారు చేసేవాళ్లం. గోళీలు, బిల్లాకోడి, దాగుడుమూతలు ఇవే మాకు తెలిసిన ఆటలు. వెన్నెల రాత్రుల్లో మా ఊరి గుడి ఆవరణంలో పిల్లలం రేయి తెల్లవార్లూ ఆడుకునేవారం. అలాగే నక్కల కాలువ గట్టున విశాలమైన మైదానం ఉండేది. అక్కడ పెద్ద చింతతోపు.. అందులో ఆడుకునేవారం.

పండుగలంటే.. నా చిన్నతనమే ఓ పండుగ. ఆ నాటి మా ఊరే ఓ పండుగలాగా ఉండే ది. ఉగాదికి చెట్లెక్కి వేప పూలు కోసేవారం. సంక్రాంతి ఇంటిల్లిపాదీ వేడుకగా జరుపుకునేవాళ్లం. ఇక దీపావళి అంటే.. 20 రోజుల ముందునుండీ సందడి మొదలవుతుంది. ఎందుకంటే అప్పట్లో పటాసులు స్వంతంగా తయారు చేసుకునే వారు. మా మావయ్యలు మందుగుండు సామగ్రి తయారీకి కావలసిన ముడిపదార్ధాలు బొగ్గుపొడి, గంధకం, సూరేకారం, పెట్లుప్పు వంటివి ముందుగానే సేకరించే వారు. వాటిని రెండు వారాల ముందునుండీ ఎండబెట్టడం మా పిల్లల పనిగా ఉండేది. ఇలా తాటాకు టపాసులు, మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, సిసింద్రీలు, భూచక్రాలు చేసేవారం. మగ తాటి చెట్టు పూతను ఎండబెట్టి, మందు దట్టించి, వెలిగించి, తాడు కట్టి గాలిలో తిప్పేవారం. ఈ సాహసం చేయడానికి నేను ముందుండే వాణ్ని. ఇక వినాయక చవితికి మట్టి వినాయకున్ని స్వయంగా చేసుకునే వారు. నాకు ఇద్దరు అక్కలు, ఓ చెల్లెలు ఉన్నారు. మా అక్కయ్యల వివాహాలు మా ఊరి అలయంలోనే జరిగాయి. మా నాన్న గారు వేదాలు, ఉపనిషత్తులు చదివే వారు. మా అన్నగారు, మళ్లంపల్లి సోమశేఖర శర్మ పెద్ద పండితులు. చరిత్ర పరిశోధన వారికి ఎంతో ఆసక్తిగల అంశం. ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. కారీక్త మాసంలో ఆనాడు మా గ్రామంలో ‘గణార్చన’ చేసేవారు. నెల రోజులు రోజూ ఆలయంలో ఉత్సవాలు, వేడుకలు. ఈ నెల రోజులూ మా ఇల్లు తిరునాళ్లలాగా ఉండేది. ఇతర ప్రాంతాల బంధువులు కూడా వచ్చే వారు. అందరం పంక్తిగా కూచుని, పెద్ద గొంతుతో శివపూజ చేసిన తరువాత భోజనానికి ఉపక్రమించే వారు. వేసవి కాలంలో కరణంగారు ఊరందరికీ ‘వేసంగి సంతర్పణ’ చేసేవారు. ప్రతి ఇంటికీ ఓ విసనకర్ర, మామిడి పళ్లు పంచేవారు. అలాంటి గ్రామాలు ఈ కాలంలో కలికానిక్కూడా కనిపించవు.

ఇలా ఉండగా, నా చదువుపై బెంగ పెట్టుకున్న మా అమ్మగారు నన్ను మా అన్నగారితో నా 12వ ఏట అనుకుంటాను రాజమండ్రి పంపించేశారు. అక్కడ నుండి నా 15వ యేట అన్నగారి కుటుంబంతో కలిసి చదువుకోవడానికి ఈ మద్రాసు వచ్చేశాను. తొలుత ప్రస్తుతం హైకోర్టు ఎదురుగా ఉండే మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజి హైస్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివాను. ఇంటర్‌తో నా చదువుకు ముగింపు పలికాను. తాపీ ధర్మారావు గారి ‘జనవాణి’ పత్రికలో ఉప-సంపాదకునిగా ఉదోయగంలో చేరాను. నా చేతి రాత చాలా అందంగా ఉండేది. అప్పట్లో మద్రాసు ఉమ్మడి రాష్ర్ట కదా, ఇక్కడే తెలుగు రేడియో కార్యక్రమాలు కూడా రూపొందేవి. అందులో ప్రసారం చేసే నాటకాలను వివిధ పాత్ర ధారులకు ఇవ్వడానికి వీలుగా ‘కాపీలు’ రాయవలసి వచ్చేది. ఆ సమయంలో ఎవరో అటువంటి వ్యక్తి కోసం వెతుకుతుంటే.. తాపీ ధర్మారావు నా చేతి రాత గురించి వారికి చెప్పి నన్ను రేడియోలోనూ పని చేయడానికి అనుమతించారు. ఉదయం జనవాణిలో, సాయంత్రాలు ఆలిండియా రేడియోలో కాపియిస్టుగా పని చేసే వాణ్ని. ఆచంట జానకీరాంగారు తరువాత నన్ను రేడియోలో ఉద్యోగంలోకి తీసుకున్నారు. అప్పట్లో మార్షల్‌ రోడ్డులోని పోలీసు మైదానంలో ఉన్న మూడు అంతస్తుల భవనంలో రేడియో స్టేషన్‌ ఉండేది. అలా 1938లో తొలి సారి రేడియోలో నా ప్రస్ధానం ప్రారంభమైంది. 40 సంవత్సరాల సర్వీసు తరువాత 1977లో పదవీ విరమణ చేశాను. ఆకాశవాణిలో వందలాది చిన్న పిల్లల కార్యక్రమాలు నిర్వహించి రేడియో తాతయ్యగా ప్రసిద్ది పొందాను.

ఇది గతానికి చెందిన ఓ అందమైన దృశ్యం. అందులో ఓ చిన్న గ్రామం, మనుషులు, మమతలు, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అరమరికలు లేని బాల్యం ఉన్నాయి. ఇదే ఈ వారం రేడియో తాతయ్య ఉమామహేశ్వరరావు ఊరి కథ.



2 comments:

Unknown said...

mannava gangadhara prasad గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Anonymous said...

mu(he) died on 13-7-2011 at the age of 100 in chennai. my his sole resat in peace