Friday, June 25, 2010

ఊపిరి ద్రావకం

ఒక రాత్రి
నేను
నిద్ర రాక, అసహనంగా ఉన్నాను
వీపులోనుండి చెమట ధార కారుతూ
ఏసీ పరువు దిగజారుస్తూ ఉన్న వేళ
కిర్రుమంటూ తలుపు తెరుచుకుంది
లాక్‌ చేయనందుకు విసుక్కున్నాను
నెమ్మదిగా లేచి టెర్రస్‌లోకి నడిచాను

తలకు ఆకాశం తగులుతుందేమో అనిపించే చీకటి
జీవితం ట్రాఫిక్‌ సిగ్నళ్లు లేని రోడ్డులా ఉంది
ఈ సమయంలో. . . ఆకాశమే కాదు
నేల కూడా తలకు తగిలేలా ఉంది
చల్లని గాలి వీపులో గుచ్చుకుంది
నెమ్మదిగా, కళ్లను తగిలించుకున్నాను
విశాలత్వం ఏమిటో అర్థమైంది

రేపు వెలుగు వస్తే
మబ్బులపూలు పూస్తే
నవ్యుల ముగ్గులు మొలిస్తే
జ్ఞాపకం.. అలాగే ఘనీభవిస్తే
ఉలిక్కి పడ్డాను

వేగు చుక్క వెక్కిరిస్తోంది.
చీకటిని చూచి తల దించుకోవద్దని
పైకి చూస్తే
వెలుగు చుక్కలు దిక్కులు చూపుతాయని
తెలిసింది

ద్రవించిన ఊపిరితో తడిచిన గుండెలను
పిండుకుని
వెళ్లి
పడుకున్నాను
కల
కొనసాగుతూ ఉంది
- మన్నవ గంగాధర ప్రసాద్‌ (25-06-10)

1 comment:

Anonymous said...

ooopiri teesu kokundaaaaaa cadivaaanu. suparb