Friday, July 2, 2010

Metaphor

కళ్లు నులుముకుంటూ లేచాను
ఎదురుగా ఆవులిస్తున్న అరుణబింబం
ఏమిటో ఇలా ఉందని చూస్తే...
కదులు తున్న పర్వతాలు కనిపించాయి.
ఆకాశం నిండా పేరుకుపోయిన
మబ్బుల దిబ్బులను
ఎవరో ముఖం కప్పుకున్న మగువ
తన వాలుజడతోకట్టి లాక్కుపోతూ ఉంది.
పైన ఫ్యాను మూడు ముఖాలుగా విరిగిపోయింది.
బిక్క ముఖం వేసుకుని చూస్తున్న
నిలువుటద్దం నిండా హస్తరేఖలు అలుముకున్నాయి.
అబ్బో అనుకుని
మంచం దిగడానికి లేచానా జిల్లున చంద్రుడు తగిలాడు
పాపం రాత్రి
కబోర్డులో దాక్కున్నాడు కాబోలు
ఎందుకైనా పనికి వస్తాడని తీసి
పైజుమా జేబులో దాచాను.
చేటల్లా వెల్లకిలా పడుకున్న
నా హవాయి చెప్పుల్లో
పాదాల పాములు దూర్చి
అడుగు వేద్దాం అంటే
అక్కడ ఒంటరి పులిపిరి కాయలా ఖగోళం కనిపించింది.
ఇంతలో
లోపలినుండి ఏనుగులు పరుగుతీస్తున్న శబ్ధం వినిపించింది
కడుపు తలుపు తెరిచి చూస్తే..
వనాలు తినేస్తున్న
వెర్రి జనాలు కనిపించారు.
ఇక ఇదే భవిష్యత్తనుకుని మళ్లీ పడుకున్నాను.
-- మన్నవ గంగాధర ప్రసాద్‌ (28.06.2010)

1 comment:

Anonymous said...

good poetry, fine. keep going...