స్కైబాబా - అధూరె కథా సంకలనం
సమీక్ష - మన్నవ గంగాధర ప్రసాద్
ఎస్‌కె యూకూబ్ బాబా రచయితగా స్కైబాబాగా ప్రసిద్ధులు. వీరి శ్రీమతి సాజహానా కూడా స్త్రీవాద రచయిత్రి.ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉప సంపాదకునిగా వివిధ పేజీ చూస్తున్న యాకూబ్ చక్కటి రచయిత.ఇది తెలంగాణా ముస్లీం కథల సంకలనంగా రచయిత పేర్కొన్నప్పటికీ, తెలుగులో రాసినవన్నీ తెలుగు కథలే. ఇందులో విభజనలు అవసరం లేదని నా భావన. ఇటీవలి ధోరణిలో భాగంగా భాషలో మాండలికాలుండవచ్చు.
సాహిత్య ప్రపంచంలో ఉన్న అనివార్యతల కారణంగా తెలుగులో తెలంగాణా ఆంధ్ర వంటి ప్రాంతీయ ధోరణి వచ్చింది. ఇందులో మళ్లీ మతాల వారీగా, కులాలు-ఉప కులాల వారీగా సాహిత్యం వెలువడడం జరుగుతోంది. ఇది ఎంత వరకు మంచిది అంటే, అంతా మన మంచికే అని నా సమాధానం.
ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారుతున్నరొజుల్లో ఇక భాష మాట్లాడే ప్రజలు మళ్లీ విడిపోవడం ఆలోచించ వలసిన విషయం ఈ మౌళిక మౌన అంశాల జోలికి వెళ్లకుండా అధూరె కథా సంకలనాన్ని తూచినపుడు, నా కనిపించింది.... కథా రచయిత తను చూసిన జీవితాన్ని కథల రూపంలో కాగితంపై ఆవిష్కరించారు. ఇందులో ఎంత వరకు సఫలీకృతులైనారు. రాశి కంటే వాశి ముఖ్యం.
అధూరె పుస్తకంలో ౧౨ కథలున్నాయి. ఇవన్నీకూడా స్కైబాబా జీవితంలోనుంచి వచ్చినవి.
౧౨ కథలు ౧౨ వైవిధ్యమైన అనుభవాలు. ఇవన్నీ అసంపూర్తిగా ముగిసేవే. అంధుకే కథా సంకలనానికి కూడా అధూరే (పూర్తి కాని) అని పేరు పెట్టారు రచయిత.
ఈ కథల్లో ముఖ్యంగా మనకు కనిపించేది రెండు విషయాలు. ఇకటి తెలంగాణ జీవితం. రెండు తెలంగాణా ముస్లీం కుంటుంబాల వ్యవహారం. ఈ వన్నీ కూడా మనకందరికీ పరిచయం లేని విషయాలు. ప్రాంతాల వారీగా జీవన విధానంలో వైవధ్యం ఉంటుంది. ఈ పుస్తకం అంతా చదివితే, ఒక పది సంవత్సరాలు మనం కూడా తెలంగాణాలోని ముస్లీం కాలనీలో ఓ ఇంట్లో అద్దెకున్న భావన కలుగుతుంది. కథలన్నీ కథలుగా కాకుండా మన పాత జ్ఞాపకాలుగా వెంటాడుతూ ఉంటాయి. బన చిన్నతనంలో జరిగిన సంఘటనలుగా కథలే మిగిలిపోతాయి.
ఇందులో రచయిత ఆవేదన మనకు కాస్త వెగటు కలిగిస్తుంది. చిన్న సమస్యలకు తీవ్రంగా స్పందించే గుణం కనిపిస్తుంది. ఉదాహరణకు వెజిటేరియన్ కథ తీసుకుందాం. ఇందులో బహుశా రచయితే అద్దె ఇంటికోసం వెదికే క్రమంలో కనిపించే వ్యక్తుల పట్ల చాలా తీవ్రంగా స్పంధిస్తారు. తనకు ఇల్లు అవసరం కాబట్టి, తాను వెళ్లి అడిగిన తరువాత ఇంటి యజమాని ఇల్లు ఇవ్వకపోవడం అతని అహంకారంగాను. కులం గుణం గానూ కనిపిస్తుంది.
అంతే కానీ, వారి ఇళ్లు, వారికి నచ్చిన విధంగా అద్దెకు ఇచ్చుకుంటారు అనే సహనంలోపించినట్టు కనిపిస్తుంది. ఇల్లు కట్టుకున్న బ్రాహ్మడు, ఆ ఇల్లు బ్రామ్మలకే ఇవ్వాలనుకోవడంలో అంటరానితనం ఏమిటో పాఠకునికి అర్థం కాదు. ఇలాంటివే చిన్న సమస్యలు తీవ్రంగా రచయితను ఆవేదనకు గురిచేసినట్లు తెలుసుకుంటాం. అయితే అన్ని కథలు చదివిన తరువాత నాకు కనిపించిన అతి ముఖ్యమైన విషయం, ఈ నాటి యువతరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, కొన్ని కథల్లోని మహిళలు అన్ని విధాలుగా చనిపోవలసిన పరిస్థితిలో ఉన్నట్లుగా కనిపించినా, ఎవరూ ఆత్మహత్యకు పాల్పడరు. కథల్లో పాత్రలకు ఉరి పెట్టుకోవాలనే సందర్భాలు చాలా కనిపించినా, ఏ పాత్రా చనిపోదు. జీవితం జీవించడానికి, అర్థాంతరంగా చనిపోవడానికి కాదు. సమస్యలతో పోరాడడం మానవుల లక్ష్యణంగా చూపిన అంశం చాలా ముచ్చట కలిగించింది. పుస్తకాలను చదివి జీవితాలను చూసిన అనుభూతి కలిగించిన నామిని, మిట్టూరోడికథలు, పచ్చనాకు సాక్షిగా, ఖదిర్‌బాబు దర్గామిట్ట కథలు వంటివి ఇటీవల మనం చూశాం. ఆ కోవలో ఒక ప్రాంతంలోని, ఒక మతం ప్రజల జీవనం, ఆ జీవితాల్లోని కన్నీళ్లు, ఆనందానుభూతులు, పాఠకునికి కళ్లకు కట్టినట్లు చూపించే కథలు ఈ అధూరె కథలు.
No comments:
Post a Comment