రెండుప్రశ్నలు
... మన్నవ గంగాధరప్రసాద్(04.08.2014)
టిక్..టిక్.. మంటూ గడియారం నడుస్తోంది.
రాత్రి 11 గంటలను మోసుకుంటూ.. వరండాలో తచ్చాడుతున్నాను, నిద్రపట్టక.
ఇలా ఎపుడూ లేను. పరుపే కాదు, చాపపై పడుకున్నా, వెంటనే నిద్రపట్టేస్తుంది.
ఇవ్వాలే.... ఇదో కొత్త అనుభవం. ఉదయం నుంచీ ఇలాగే ఉంది. ప్రతి శనివారం నాకు సెలవు.
ఆ రోజు ఉదయం బీచ్‌లో నడక కోసం సముద్రతీరానికి వెడుతూ ఉంటాను. గత కొన్నేళ్లుగా అది నా అలవాటు.
అట్లాగే ఈ ఉదయమూ వెళ్లాను. అక్కడ నాతోపాటె నడిచే మిత్రుడు గంగాధర్ మౌనంగా ఉన్నాడు. నడవడం లేదు. పాడుబడిన నాటు పడవ పక్క నీడలో కూచుని, శిధిలమౌతున్న శిలలా ఉన్నాడు.
ఓ పది నిమిషాలు నా మటుకు నేను నడుచి, కాస్త సేద తీరడానికి వాడి పక్కన కూచున్నాను. అపుడు చూశాను వాడినల్లని బుగ్గలపై చారలు కడుతున్న కన్నీటిపాయలను. సముద్రంలో కలవడానికి దు:ఖనది పారుతూ ఉన్నట్టనిపించింది. మనసంతా గజిబిజిగా మారింది. భుజంమీదున్న టవల్‌తో ముఖంలో చెమటలు తుడుచుకుంటూ, వాడి భుజం మీద చేయి వేసి పలుకరించా. కళ్లతోనే, కూచో మన్నాడు. ఏం? ఇలా ఉన్నావేం, అన్నను. కూచుని, నీళ్లు తాగుతూ.. నా ముందు రెండు మార్గాలున్నాయి అన్నాడు. అర్థం కాలేదు. అలలడ సవ్వడి అనుకుని, ఏందీ అన్నా.. ఇపుడు నా ముందు రెండే దారులున్నాయి మన్నవా అన్నాడు. పడవకు వీపు ఆనించి కూచుంటూ, ఏంటో వివరంగా చెప్పరా.. అన్నాను. నా బాటిల్ తీసుకుని, గొంతు తడుపుకుని, ఎం లేదురా, బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించడం. కాదంటే, నిస్సిగ్గుగా బతికేయడం ఈ రెండు దారుల్లో ఏది ఎంచుకోమంటావేం.. అన్నాడు. అవాక్కయ్యాను. భుజం తడుతూ, ఎందుకురా అలా, మరీ ఇంత నీరసించిపోతున్నావేం అన్నా. నా చుట్టూ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. వాటిని నేను మార్చలేను. అలా అని సర్దుకుంటూ, పక్కకి జరుగుతూపోతూ ఉండనూ లేను. ఏం చేయమంటావు? అంటూ నాకళ్లలోకి చూశాడు.
నేను కళ్లు దించుకుని, ఇసుకలో కెలుకుతూ మౌనంగా ఉండిపోయాను. జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండా, ఎన్ని చదువులు చదివినా వృధారా అని మనసులో అనుకున్నా. చీకటిగా ఉన్నపుడే కదా వెలుగు కోసం వెతుక్కోవాలి. ప్రతికూలతాలతనుకత్తరించే జ్ఞానకత్తికి వైరాగ్యం పదును పెడుతుందనిపించింది. గంగాధరా! నీకు ఉన్న అనుభవాలే దాదాపుగా అందరికీ ఉంటాయి. సున్నితంగా స్పంధించడం నెమ్మదిగా తగ్గించుకో. అదీ ఒక రకం సాధనే. ఏనుగంత నైపుణ్యం ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకుండా కూలిపోయిన వ్యక్తులను చూస్తూనే ఉన్నాం కదా. ఇదీ అంతే. నీ కష్టం ఏమిటో మనసు విప్పి చెప్పినా నా వద్ద పరిష్కారం లేకపోవచ్చు. అందువల్లా.. మౌనంగా నడుచుకుంటూ జీవిత రేఖవెంబడీ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతే తప్పులేదురా. ఆత్మహత్య మాత్రం వద్దు. అన్నాను. ఎండ పెరగడంతో ఇద్దరూ లేచి వచ్చేశాం. వాడు మౌనంగానే కారెక్కివెళ్లిపోయాడు. నేనూ ఇంటికి వచ్చేశాను. ఆయినా వాడన్న మాటలు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహం నాలోనూ లేదు. అందుకే నిద్ర రావట్లేదేమో....
---000---
No comments:
Post a Comment