Wednesday, September 17, 2014

నేనెరిగిన శంకరంబాడి
- మన్నవ గంగాధరప్రసాద్‌          ఇలా ఒక వ్యాసం రాయవలసి వస్తుందని నాకు తెలియదు. కానీ, ఆ అవసరం వచ్చింది. ఒక రాష్ట్రగీత   కర్తను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, సాహిత్య సంఘాలు కూడా మరచిపొయిన సమయంలో లేకపోతే పట్టించుకునే తీరికి లేని కాలంలో రాషే్ట్రతరులయిన ఇద్దరు తెలుగు తల్లి ముద్దుబిడ్డలు నాకీ అవకాశం కలిగించారు. ఒకరు జనని సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల చెన్నయ్య కాగా రెండవ వారు డాక్టర్‌ విస్తాలి శంకరరావు. వీరికి ముందుగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసి, నా మనోభావాలను మీ ముందుంచుతాను.

          నిజానికి ఈ వ్యాసం రాయడం కొంత సాహసంతో కూడిన పని. నేనెరిగినఅని అనడంలో అతిశయోక్తి ఉంది. ఎందుకంటే వ్యక్తిగా నేను బహుళ ప్రఖ్యాతిచెందిన వాడను కాను. అలాగే వయసు రీత్యా శంకరంబాడి సుందరాచారిని గూర్చి రాయదగ్గవాడిని కానేమో... అన్ని నిబంధనలకూ ఒక మినహాయింపు ఉన్నట్టుగా, ఇక్కడ నాకున్న మినాహాయింపు ఏమిటంటే.. మా నాన్నగారికి గురువుగారయిన శంకరంబాడి మా ఇంట కొంతకాలం ఆశ్రయం పొందడం. నా చిన్నతనంలో నేను ఆయన్ని అలా ఎరిగి ఉండడం. అది మేరుశిఖరమని అపుడు తెలియకపోయినా,   ఎత్తయిన శిఖరాన్ని దగ్గరగా చూడగలిగిన ఒక పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ అవకాశం వచ్చింది. మంచిది. శంకరంబాడిని ఎట్లా గుర్తు తెచ్చుకోవాలో నేను కొంత ఆలోచన చేశాను. నాకు మరీ ఏమంత వయసులేని కాలంలో నేను ఆయనను చూశాను. ఆయన మాతో, మా ఇంట ఉన్నారు. లీలగా ఉన్న ఆ జ్ఞాపకాల దారిలో నడవడానికి ప్రయత్నిస్తాను.

          శంకరంబాడి సుందరాచారి పక్కాతాగుబోదు. ఆయన నిత్యం సురాపానకళా విన్యాసంలోనే ఉండేవాడు. ఆయనకు బరువు, బాధ్యత తెలియదు, వారు ముక్కోపి, ఒక చిన్న సంఘటనతో తన ఉద్యోగానికి అక్కడికక్కడే రాజీనామా ఇచ్చిన వారు. అన్నవి కొన్ని వదంతులు ఆయన గురించిన ప్రచారంలో ఉన్నాయి. ఈ కారణంగా సమకాలీనులు కొందరు వారిపై పెద్దగా సద్భాం ప్రదర్శించకపోవడం నేనెరుగుదును. (అలా అన్న వీరు మాత్రం మధుపాన ప్రియులయినా అభ్యంతరం లేదు)

          సెప్టెంబరు 9 వ తేదీన కాళోజీ శత జయంతిని పూర్తిగా తలకెత్తుకున్న పత్రికలు అంతకు ఒక నెల ముందుగానే ముగిసిన శంకరంబాడి శతజయంతిని గురించి నామ మాత్రంగా కూడా పట్టించుకోకపోవడం ఆంధ్రప్రదేశ్‌ పత్రికల దుస్తితికి అద్దంపడుతోంది. ఇందుకు విచారిస్తున్నానను. ఒకరి జయంతి/వర్థంతి ఎందుకు చేశారని ప్రశ్నించే అధికారం ఇతరులకు లేకపోయినా, మరో అంతేవాసిని ఎందుకు మరచిపోయారని అడగవచ్చుననుకుంటున్నాను. ఇందులో తప్పేమైనా ఉందా!  

          ఈ గొడవ కంటే, శంకరంబాడి గురించీ చెబుతా.. మా నాన్నకు బోధనారంగంపై ఉండే ఆసక్తి కారణంగా మేం తిరుపతికి రావలసి వచ్చింది. నిజానికి నా పుట్టుక, నా జీవితం వెనుక శంకరంబాడిగారున్నారు. ఎట్లా అంటే, ఒక దశలో వివాహం అంటే ఆసక్తి చూపని మా నాన్నకు హితబోధ చేసి, మా తాత గారి మనసెరిగి నడుచుకో   వాలని సూచించినవారు శంకరంబాడి. ఆ కారణంగా మా నాన్న వివాహం జరిగింది.  కొంత కాలానికి తొలి సంతానంగా నేను జన్మించాను. అచ్చం గురువుగారి మాటకోసమే మా నాన్న ఆ నాడు పెళ్లికి అంగీకరించినట్లు వారే స్వయంగా రాసుకున్నారు కూడా. ఇక రెండవది. నా జీవితం. ఇది ఇంకా అపవిత్రం కాకుండా, శ్రీనివాసుని చరణారవిందాలను నమ్ముకుని సన్మార్గంలో సాగుతూ ఉండడానికి కూడా శంకరంబాడి కారణం. ఇదే  వారితో నాకున్న అనుబంధం. ఇట్లా ప్రత్యక్షంగా శంకరంబాడి సుందరాచారి అనే వ్యక్తి నా మనుగడకు కారణభూతంగా నిలిచారు. గురువుగా ఆ నాడు మా తండ్రికి హితవు పలికారు. నాకేమో వారి జీవనం ద్వారా పరోక్షంగా మార్గదర్శనం చేశారు.  అందువలన నేను నా జీవన యానంలో లౌకికంగా లాభపడినానా! నష్టపోతున్నానా? అన్నదానిలో నాకు చింతలేదు. ఇంతకంటే పతనమయికూడా ఉండవచ్చు కదా, అందువలన ఇప్పటి వరకూ అంతా మంచే జరిగిందని భావిస్తాను. అందుకు సుందరాచారి గారే చుక్కాని. మరో విషయం.. ఎంతో ప్రధానమయినది కూడా ఈ సమయంలో ప్రస్తా    విస్తాను.. మా నాన్నగారికి చదువు చెప్పిన సుందరాచారి, వైకేవీయన్‌ ఆచారి వంటి వారి కారణంగా మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడుగా జీవించాలని చిన్నతనంలోనే, చదువుకునే కాలంలోనే అనుకున్నారు. నిర్ణయించుకున్నారు. ఆ ప్రతిజ్ఞ కారణంగానే వారి తండ్రి (మా తాతగారు) ప్రతిపాదించిన రెవిన్యూ ఉద్యోగాన్ని కాదనుకున్నారు.  చాలా తక్కువ నెల జీతానికి ఏకోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. తద్వారా చిన్నతనంలోనే రెవిన్యూ శాఖ లో చేరి, సర్వీసు ముగిసే నాటికి అత్యున్నత స్ధానానికి చేరుకున్న రాష్ట్ర అధికారిగా మారవలసిన మా నాన్న ఆధ్యాపకునిగా మిగిలిపోయారు. అట్లా బోధనకు సంబంధించిన జీవన శైలి, సాహిత్యం, కవిత్వం, నటన వంటివి నా వంటపట్ట   టానికి కూడా సుందరాచారి మార్గం ఏర్పరిచారు. రెవిన్యూ అధికారి కుమారునిగా నా చిన్నతనం, జీవన విధానం మరో రకంగా ఉండేవి కదా? కాదంటారా!

          అట్లా 1969 లో తిరుపతి చేరుకున్నాం. ఆ తరువాత రెండేళ్లకు 1972 ప్రాంతంలో భవానిగర్‌లో ఒక అద్దె ఇంట్లో చేరాం. అక్కడ మరో మారు శంకరంబాడి సుందరాచారి మా నాన్నకు తారసపడ్డారు. అప్పటికే ఆయన బాగా చితికిపోయారు. భార్య మరణించింది. సంతానం లేదు. బంధువుల ఆలనా, పాలనా లేదు. మద్యానికి దాసుడయ్యారు. ఒకరిద్దరు రచయితలు ఆయనను ఆదరించేవారు. అలా కాలం వెళ్లదీసేవారు. మా నాన్నగారు కనిపించడంతో వారికి  కాస్త ఆదరవు దొరికింది. మా ఇంట ఉండేవారు. అలా చివరివరకూ మాతో ఉన్నారు. ఆయన ఉన్నందున మాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. అప్పట్లో వారు మాతో సరదాగా ఆడుకునేవారు. చెప్పనేలేదు కదూ. మా నాన్నగారికి మేం ముగ్గురం సంతానం నేను పెద్దవాణ్ని, తరువాత తమ్ముడు, చివర చెల్లి.  అపుడు నా వయసు పది సంవత్సరాలు కూడా లేదు.

          మా నాన్నగారితో ఉన్న చనువుకొద్దీ ఆయన మా ఇంట్లో ఉన్నా, ఏనాడూ.. మాకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినట్లు గుర్తు లేదు. మాకు అసౌకర్యం కలిగించే వారు కాదు. ఎంతో సౌమ్యంగా ఉంటూపిల్లలతో ఆదరంగా ఆడుకుంటూ ఉండే వారు. అప్పట్లోనే మా నాన్నగారి పుస్తకం ముద్రణ కోసం ఓ పోలీసు మిత్రున్ని అడగి మరీ డబ్బు తెచ్చి ఇచ్చిన మంచి వ్యక్తి, మనసున్న వాడు సుందరాచారి. ఆ డబ్బు మా నాన్న గారు తీసుకోలేదు.  ఆ తరువాత తితిదే వారి ఆర్థిక సాయంతో సుమాంజళిశతకాన్ని మా నాన్న ముద్రించారు. అపుడు వారితో ప్రెస్‌కు వెళుతూ ఉండడం, ఆ పుస్తకావిష్కరణ సభ నాకింకా గురుతే. ఆ శతకంలో చాలా సీస పద్యాలు అప్పట్లో మాకు    కంఠోపాఠంగా ఉండేవి.

          మా అమ్మ గురించి జనని వారి ప్రత్యేక సంచికలో విపులంగా రాసి ఉన్నాను. అందువలన ఇక్కడ మళ్లీ  అంతా చెప్పదలచుకోలేదు. మా అమ్మకు ‘‘మందు’’ పుచ్చుకునేవారంటే చాలా అసహ్యం. అయినా, శంకరంబాడిగారిని ఎన్నడూ విసుక్కున్నట్లు నేను గమనించలేదు. ఆయనకు అవసరమయిన భోజనం, స్నానపానా దులకు మౌనంగా ఏర్పాట్లు చేసేది. ఆ కాలంలో మా అమ్మకు కొద్దిగా కీళ్ల జబ్బు ఉండేది. అందువలన పెద్దగా వస్తువులను ఎత్తలేక  పోయేది. అందువలన వంటలో పెద్దకుర్రాడుగా నేను తరచూ సాయం చేస్తుండే వాన్ని. సుందరాచారి కోసం మా అమ్మ ఒక పొడవైన స్టీలు గ్లాసు మాత్రం ప్రత్యేకంగా పెట్టేది. దానిని ఇతర వంట సామాన్లతో కలవనిచ్చేది కాదు. దాని పేరు సుందరాచారి గ్లాసు’. వారు మద్యం తాగడానికి వినియోగించేవారన్నమాట. అందువలన ఆ గ్లాసును  మాత్రం విడిగా పెట్టేది. సుందరాచారి చనిపోయి, మేం రెండు ఇళ్లు మారి, స్వంత ఇంటికి వెళ్లిన తరువాత కూడా  ఆ గ్లాసు అలా మా ఇంట్లోనే ఉండేది.

          బహుశా, ఇప్పటి వరకూ మందు ముట్టకుండా ఉండగలిగే శక్తి నాలో ఉండడానికి కూడా సుందరాచారి కారణం. ఆయన గ్లాసు పట్ల మా అమ్మగారు చూపిన విముఖత కారణంగా నేను కూడా మందు పుచ్చుకునేవారితో కలవలేకపోయేవాణ్ని. అటువైపు తలపెట్టలేకపోయేవాణ్ని. మద్యం తాగకపోవడం గొప్ప ఘనకార్యం అననుగానీ, అలా ఉండగలగడం మంచి లక్షణమే కదా. ఆ మంచి లక్షణం నాలో ఉండడానికి శంకరంబాడి సుందరాచారి కారణం. అందుకయినా నేను ఆయనకి నమస్కృతులు తెలియపరుస్తూ ఉంటాను. కొంత కాలం క్రితం నాఇంట్లో వచ్చిన సమస్యలపుడు కూడా నేను మానసిక దౌర్బల్యానికి గురికాకుండా ఉండడానికి వీరే కారణం. మళ్లీ మనిషిగా నిలబడడానికి కూడాఅదే కారణం. ఆ విధంగా అటు మా నాన్నగారికి పెళ్లి విషయంలో తగిన సమయంలో తగిన సలహా ఇచ్చిన వాడు, ఇటు నేను పతనం కాకుండా ఆదుకున్నవాడూ శంకరంబాడి సుందరాచారి. ఆ విధంగా ఆయన ఇద్దరి జీవితాలకు చుక్కానిగా నిలిచారనడంలో అతి శయోక్తి లేదు.

          ఇపుడు తిరుపతిలో తీతీదే కళాశాలలో ప్రిన్సినల్‌గా ఉన్న డాక్టర్‌ జి. రమేష్‌ బాబు అనే మా బంధువు, (నాకు అన్నయ్యవరుస) కూడా అప్పట్లో మా ఇంట ఉండేవారు. చదువుకుంటూ.. వీరితో కూడా సుందరాచారి చాలా మర్యాదగా, చనువుగా ఉండేవారు. మా అన్న ముక్కుపై కూడా ఆశువుగా పద్యాలు చెప్పారని గురుతు. వాటిని భద్రపరచక పోవడం విచారకరం.  ఇంకా ఇరుగు పొరుగుల ఇండ్ల వద్ద ఉన్న సమయంలో కూడా ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టిన దాఖలా లేదు. ఇటీవలే ఒక మిత్రుడు చాలా ఏళ్ల తరువాత ఫోన్‌ చేసినపుడు సుందరాచారి ప్రస్తావన వచ్చి, ఎంతో బాధపడ్డారు. ఆయన మా పక్క వీధిలో ఉండే వారు. వారి ఇంటికి కూడా సుందరాచారి తరచూ వెళ్లేవారని నా మిత్రుడు గుర్తు చేసుకున్నారు. బహుశా, మా నాన్నగారు పగలు కాలేజీకి వెడుతారు కదా, ఆ సమయంలో ఆయన ఇలా ఇతరుల ఇంటికి వెళ్లేవారు. లేదా పులికంటి కృష్టారెడ్డి వంటి వారితో కలిసేవారు.  మళ్లీ మా నాన్నగారు సాయంత్రం ఇంటికి చేరుకున్నతరువాత నెమ్మదిగా వచ్చేవారు. ఈ ఒక్క సంఘటనా ఆయనలోని ఔదార్యాన్ని, సహృదయతనీ పట్టిఇస్తుంది. తాగుడుకు అలవాటు పడినా, ఇతరులను ఇబ్బందిపెట్టకూడదనే సంస్కారం ఆయనలో చివరివరకూ మిగిలే ఉంది. నాకు తెలిసి ఎర్రంనాయుడు తాత ఇంటికి  వెళ్లినా, కృష్ణమనాయుడు గారి ఇంటికి వెళ్లినా ఆయన ఇతరులకు సమస్య కాలేదు. వీరంతా భవానీనగర్‌లో అప్పటి  మా ఇరుగు పొరుగువారు.

ముందు-తరువాత :
          శంకరంబాడి సుందరాచారి గారు మా ఇంట ఉండగానే వారికి ఆంధ్రరాష్ట్ర కవిగాగుర్తింపు వచ్చింది. 1975 నాటి ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో ఓ రాత్రి వేళ పోలీసులు మా ఇంటికి వచ్చారు. మేం కంగారు పడ్డాం. మా నాన్నగారినే శంకరంబాడి అనుకున్న పోలీసులు కలెక్టర్‌ గారు రమ్మంటున్నట్లు తెలిపారు. తరువాత నెమ్మదిగా విషయం తెలిసుకున్న  మా నాన్న, సుందరాచారిని పోలీసులకు చూపి, తనుకూడా వారితో వెళ్లాడు. ఆ మరునాడు స్వయంగా హైద్రాబాదుకు రైలు ఎక్కించారు. అక్కడ ‘‘మాతెలుగు తల్లి’’ గీతానికి రాష్ట్ర గీతంగా గొప్ప గౌరవం దక్కింది. సుందరాచారి ఒక్క సారిగా రాష్ట్ర గీత రచయితగా ప్రసిద్దులైనారు. అయినప్పటికీ, ఆ తరువాత వచ్చిన పేరు ప్రతిష్టలు, సత్కారాలు, ఆయనను లొంగదీసుకోలేదు. మనిషిలో ఎటువంటి మార్పూలేదు. ముందున్న నిర్లిప్తతే. అంతే నిరాడంబరతే చివరి వరకూ కొనసాగించారు. ఎంత నిశ్బబ్ధంగా లోకంలోకి వచ్చారో అంత సడిలే కుండానే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. తన తేటగీతులతోటను మాత్రం మనకు వదిలిపెట్టారు. ఆ చక్కని తేట తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, తెలుగు తల్లి గీతాన్ని మనసారా పాడుకోవడం మాత్రమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. రాష్ట్రపతి తెలిసినవాడయినా, ప్రధాని పరిచయం ఉన్నా, లోక్‌సభ సభాపతి దగ్గరి బంధువే అయినా, ఆయన వారి ప్రాపకం కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు. చాలా చిన్నవాడయిన (ఆర్థికంగా) తన శిష్యుని ఇంట సంతృప్తిగా ఉండేవారు. కల్మషం లేని కమలం వంటి వారి మనస్సుకు ఏ మరకలూ లేవు.

          సుందరాచారి జీవితం అంతా ఏటికి ఎదురీతగానే సాగింది. చిన్నతనంలో తండ్రిని ఎదిరించి, ఇల్లు విడిచి పెట్టినది మొదలు తుది శ్వాస వదిలే వరకూ ఆయన ప్రశాంతంగా ఉన్నది లేదు. పెళ్లికి ముందు, తరువాత కేవలం  కొన్ని సంవత్సరాలు మాత్రమే కాస్త నిమ్మళంగా ఉన్నట్లున్నారు. తనలో ఇంతటి వేదనా తటాకాన్ని దాచుకుని ఆయన మనకోసం ఎన్నో వేల తేటగీతులను కాగితంపై పెట్టారు.

కాలం ఎలాగా మారిందంటే...
          ఏసు క్రీస్తు.. మీలో ఏ పాపమూ చేయనివారు రాళ్లు వేయండి అన్న సమయంలో ఎవరూ ముందుకు వచ్చి రాళ్లు వేయలేదు. తమలో తాము తమని అంచనావేసుకుని, ఆగిపోయారు. కానీ నేడు ఇదే  ప్రశ్న ఎదురయినపుడు.. అందరికంటే ముందుగా ఒకరాయివేసేసి, తాను ఏ పాపం చేయలేదని లోకానికి చాటాలనుకునే లౌల్యత ఎక్కువయిపోయింది. వెనుక ఎందరు నవ్వుకున్నా పట్టనట్టుగా వ్యవహరించడం మామూలైంది. మారుతున్న కాలం, విలువలకూ ఇదే నిదర్శనం.  అందువలననే నిత్యం తాగి, తూలే వారు కూడా సుందరాచారి తాగుబోతటకదా! అని ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు.  ఆయన తాగి ఎవరికి నష్టం కలిగించాడు. తనలోని వేదనానాదాన్ని తేటపరచి... సరికొత్త గీతాలుగా మలచడానికే శ్రమించాడు. గొప్ప కవిగా ఆయనకు పేరు దక్కకపోవడానికి తాగడమే కారణమైతే... ఎవరైనా ఎప్పగలిగేది ఏముంటుంది చెప్పండి? సత్యశీలి, త్యాగ జీవి, స్వేచ్ఛావిహంగం శంకరంబాడికి ఇదే నా అక్షరాంజలి...
తేటగీతి మాలిక:
తెలుగు వెలుగునాస్వాదించు తేటగీత
త్యాగమొక్కటే తెలిసిన ధన్యజీవి
జాతిగీతమునొసగిన జానుకవిత
సునిశిత పరిశీలనలతో చూచి.. రాసి
తెలుగునుడికారపుగుడిలో ‘‘తేటగీతి
పూలహారతి’’ పట్టిన పుణ్య మూర్తి
శంకరంబాడి సుందరాచారి సుకవి.
- మన్నవ గంగాధర ప్రసాద్‌, పాత్రికేయుడు.

No comments: