Wednesday, February 4, 2015

శ్రీరామ

కవిసంగమంలో రెండు పశ్నలు వేశారు.
నా అవగాహనలో నాకు తోచిన సమాధానాలు రాస్తున్నాను.
ఈ మంచి ప్రయత్నానికి కవిసంగమం నిర్వాహకులను మనసా అభినందిస్తున్నాను.  
- మన్నవ గంగాధ ర ప్రసాద్‌. చెన్నై








మొదటి ప్రశ్న
కవిత్వం అంటే ఏమిటి!
మనిషి మనసులోని అనియంత్రిత స్పందనలు కలిగించే అక్షర ప్రసవాలు. మనసు, ఆలోచనలు, భావనలు, వాటిని వ్యక్తీకరించే భాషా ఉన్న జీవిగా మనిషిలో కలిగే భావోద్వేగాలను అక్షరీకరించడం. అట్లా చేయడంలో సొగసుగా చెప్పాలనే ఆలంకారికత కవిత్వంగా భావించ వచ్చు (కవిత్వం అంటే అనేక అపోహలున్నాయి, కవికి-రచయితకీ తేడా తెలియని కాలం ఇది.) అలంకారాలు లేకుండా కేవలం మన మనసులోని భావాలను నేరుగా చెబితే అది ప్రకటన అవుతుంది. విజయవాడ నుంచీ తిరుపతి వెళ్లే బస్సు 5 నెం ప్లాట్‌ ఫాం పై సిద్దంగా ఉంది అనే ప్రకటనకు.
నాకు అడ్డంగా వస్తే
నేనూ అడ్డంగా నరికేస్తా...
అనే పంక్తికీ తేడాలేదు.
కవిత్వం మనిషిలోని సున్నిత గుణనిధి నుంచీ జాలువారే ఒక అనుభూతిజలపాయ. ఇది అర్ధం చేసుకోవాల్సి ఉంది.

ఇక కవిత్వం ఎందుకు అంటే...
ఎందుకు!?
నేను కవిత్వం రాయకపోతే లోకంలో తెల్లవారదా, పొద్దుపొడవదా, జీవనం ముందుకు సాగదా!.. ఎవరు ఉన్నా లేకున్నా లోకం తన దారిన తాను వెళుతూ ఉంటుంది. అయితే, కష్టజీవికి ముందు వెనుక ఉండే వాడు కవి అన్న మహాకవి శ్రీశ్రీ పలుకులు ఊతంగా, మనిషి అన్నవాడు సాటి వారి కష్ట నష్టాలను పట్టించుకోవాలి కనుక, లోకం తీరు ఇలా ఉంది, ఇలా ఉంటుంది, అలా ఉండకూడదు, ఇకనైనా మారడానికి ప్రయత్నిద్దాం అని చెప్పడం ఒక దారి. మరొకటి.. మాకు ఇట్లా అన్యాయం జరుగుతోంది, ఈ విధంగా మేం నష్టపోతున్నాం అన్నది చెప్పడం. సమాజంలోని అవక్ర విధానాలకు సమాధానాలు చూపగలగడం కవిత్వ లక్షంగా ఉన్నపుడు సమాజానికి మంచి జరుగుతుంది. రవి గాంచనిచో కవి గాంచునన్నారు కదా, అలా సమాజం మారు మూల జరుగుతున్న దుశ్చర్యలను లోకానికి ఎత్తి చూపడం మాత్రమే కాకుండా మానసికోల్లాసం కలిగించే సాహిత్య సృజన( కళారూపాకృతి) కూడా కవిత్వ ప్రయోజనంగా నేను భావిస్తున్నాను. మన్నవ గంగాధ ర ప్రసాద్‌. చెన్నై

No comments: