Monday, February 23, 2015

శ్రీరామ
ధూర్జటి- బాలికా బచావో
భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రీ.శ. 2015లో బాలికా బచావో పేరుతో దేశ ప్రజలకు మహిళా శిశు హత్యలు(భ్రూణహత్యలు) వద్దని హితవు పలకవలసిన పరిస్థ్థితిలో ఉన్నాం. అయితే క్రీ.శ. 1480-1545 మధ్య జీవించిన ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనే ఆడపిల్లలు వద్దని, మగపిల్లలను కావాలనుకునే తల్లిదండ్రులను ఈసడించుకున్న ఈ దిగువ పద్యం చూడండి. కాలం మారినా, మానవ మనస్తత్వం మారలేదనడానికి చక్కని నిదర్శనం కనిపిస్తుంది... మన్నవ గంగాధరప్రసాద్‌.  

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!    

ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవచక్రవర్తి దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసుకొని పోవునా?


No comments: